Bhadrachalam Sri Rama Navami Kalyanam Tickets: భద్రాచలం రాముల వారి ఆలయంలో ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో నిర్వహించే కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్లను ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆన్‌లైన్‌లో టికెట్లు : www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌లో రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు లభిస్తాయని అన్నారు. రూ.7,500 టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పిస్తామని దాంతో పాటు స్వామివారి ప్రసాదం అందజేస్తారని పేర్కొన్నారు. మిగతా వాటిపై ఒక టికెట్‌పై ఒకరికే అవకాశం కల్పిస్తారు. మొత్తంగా 16,860 మంది టికెట్లతో మండపంలోను, 15 వేల మంది స్టేడియం నుంచి ఉచితంగా కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు అని తెలిపారు.
ఎప్పటి నుంచి టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి?: రూ.7,500 టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు ఆలయ కార్యాలయంలోనూ ఈరోజు నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 31న నిర్వహించే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకానికి సంబంధించి ఈసారి 3రకాల ధరలతో టికెట్లను విక్రయించనున్నారు. వీటినీ ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
యాదాద్రిలో స్వామి వారి కల్యాణ మహోత్సవం: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. విద్యుత్ కాంతులతో యాదగిరి గుట్ట పరిసరాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఆలయ పునర్నిర్మాణం తర్వాత తొలిసారి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా అధికారులు నిర్వహిస్తున్నారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయ మండపంలో స్వామివారు, అమ్మవారి కల్యాణ ఘట్టాన్ని వేద పండితులు నిర్వహించారు. మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళవాద్యాలతో భక్తులు పులకించి పోయారు. నరసింహస్వామివారు, లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు.
అర్చకుల ప్రవచనాలు: శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ ఘట్టాన్ని సమస్త దేవతలు, మహర్షులు, ప్రకృతిలోని ప్రాణకోటి వీక్షించి పరవశించారని వేదపండితులు భక్తులకు ప్రవచించారు. తులా లఘ్న సుముహూర్తంలో లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం స్వామివారు లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రధారణ గావించారని వివరించారు. స్వామివారి కరుణాకటాక్షాలు అమ్మవారితో పాటు సమస్త లోకాలు సంతరిస్తాయని అర్చకులు తెలిపారు. శ్రీలక్ష్మీనరసింహస్వామికి ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం సతీమణి శోభ కల్యాణ వేడుకను తిలకించారు.
ఇవీ చదవండి: