ఏ ఎన్నికల్లోనైనా ఓట్లు అడిగే హక్కు ఒక్క తెరాసకే ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలో పువ్వాడ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రావుని అత్యధిక ఓట్లు మెజార్టీతో గెలిపించాలని కోరారు.
డంపింగ్ యార్డ్‌కు కూడా స్థలం లేదు..
తెలంగాణ ప్రాంతాలను ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చిన కేంద్రం... భద్రాచలానికి కనీసం డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకునే స్థలం కూడా లేకుండా చేసిందని దుయ్యబట్టారు. భద్రాచలం రాములోరి భూములు కూడా ఆంధ్రా ప్రాంతానికి ఇచ్చిన ఘనత భాజపాకే దక్కిందని పువ్వాడ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.