భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మీదుగా గంజాయి రవాణా నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి గంజాయిని తెలంగాణలోని హైదరాబాద్‌కు, వరంగల్‌కు తరలించేందుకు భద్రాచలం కేంద్రబిందువుగా మారింది. ప్రతిఏటా అనేకమంది యువకులు, మహిళలు గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు.
భద్రాచలంలో ఏడాదికి 50కి పైగా గంజాయి రవాణా కేసులు నమోదవుతున్నాయి. గంజాయి రవాణాకు కార్లు, టాటా మ్యాజిక్ వాహనాలు, బస్సులలో రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. బుధవారం ఒక కారులో తరలిస్తున్న 266 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు... నేడు తాజాగా మరో 208 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో పోలీసులను గమనించిన గంజాయి రవాణాదారులు ఒక కారులో గంజాయిని వదిలేసి పరారయ్యారు. ఆ కారులో గోనె సంచులలో ప్యాక్ చేసి ఉన్న 208 కేజీల గంజాయిని ఎస్సై మహేష్ స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ 31 లక్షల 50 వేలు ఉంటుందని సీఐ వినోద్ రెడ్డి తెలిపారు. గడిచిన ఐదు రోజులలో మూడు కార్లలో తరలిస్తున్న 646 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. ఈ గంజాయి విలువ 97 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. అయితే సరిహద్దు ప్రాంతంలో ఉన్న భద్రాచలంలో ప్రతిరోజు అన్ని రోడ్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని సీఐ తెలిపారు.
ఇవీ చూడండి: భద్రాద్రిలో 266 కేజీల గంజాయి పట్టివేత.. నిందితుల పరారీ