గుర్తింపు కార్మిక సంఘం కాల పరిమితి ముగిసినప్పటికీ సింగరేణి యాజమాన్యం ఎన్నికలు నిర్వహించడం లేదని ఐఎన్టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ త్యాగరాజన్ అన్నారు. సర్వీసుతో సంబంధం లేకుండా కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేశారు.
స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నప్పటికీ సింగరేణి సంస్థ అమలు చేయడం లేదని ఆరోపించారు. పలు సమస్యలపై ఈరోజు 11 సింగరేణి కార్యాలయాల ఎదుట ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని ఏరియా జనరల్ మేనేజర్ పీవీ సత్యనారాయణకు వినతి పత్రాన్ని కార్మిక సంఘం నేతలు సమర్పించారు. కార్యక్రమంలో స్థానిక ఐఎన్టీయూసీ నాయకులు గోచికొండ సత్యనారాయణ, ఇల్లందు కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు పులి సైదులు, దొడ్డ డానియల్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రవి, పోచం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రైతుల జీవితాలపై మరణ శాసనమా..?: రేవంత్