భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి మొదలయ్యే పూజల నుంచి రాత్రిపూట భజనల వరకు భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తున్నారు. వినాయకుణ్ని ఒక్కోరోజు ఒక్కో రకంగా ముస్తాబు చేస్తున్నారు. పాల్వంచలోని కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహానికే కాకుండా.. మండపాన్నీ రోజుకో రకంగా అలంకరిస్తున్నారు.
శుక్రవారం రోజున లక్ష్మీదేవిని స్మరిస్తూ.. వినాయక మండపాన్ని కోటి రూపాయలు విలువ చేసే కరెన్సీ నోట్లతో అలంకరించారు. కరెన్సీ నోట్ల మధ్య మహాగణపతి అందంగా కొలువుదీరాడు. స్వామికి 108 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వినూత్నంగా ఉన్న గణేశుణ్ని చూడటానికి చుట్టుపక్కల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
"27 ఏళ్ల నుంచి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నాం. ఎప్పుడూ మండపాన్ని వినూత్నంగా అలంకరిస్తాం. ఈ ఏడాది కూడా అలాగే చేద్దామని అనుకున్నాం. అందుకే కోటి రూపాయలు విలువ చేసే కరెన్సీ నోట్లతో మండపాన్ని, గణపతి విగ్రహాన్ని అలంకరించాం. స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా భక్తులు వస్తున్నారు."
- గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడు