ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గురువారం 45.4 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 45.0 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉభయ జిల్లాల్లోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో గురువారం మధ్యాహ్నం అన్నిచోట్లా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం నగరంలో మధ్యాహ్నం వేడి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.
లాక్‌డౌన్ నిబంధనలు సడలింపు నేపధ్యంలో రోడ్లమీదకు వస్తున్న జనం ఎండ తీవ్రతకు ఒక్కసారిగా అల్లాడిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన పెనుతుపాను ప్రభావం వల్ల జిల్లాలో వాతావరణం మారింది. గాలిలో తేమ ఆవిరైంది. దీంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి వేళల్లో వడగాల్పులు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
బయట వడగాల్పులు, ఇంట్లో ఉక్కపోతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పగటి వేళల్లో ఏసీల వాడకం పెరిగింది. మరో మూడు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తుంది. ఈ కార్తెలో ఎండల తీవ్రత పెరగనుంది. బుధవారం రాష్ట్రంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రత ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో 45.1 డిగ్రీలు నమోదైంది. జిల్లాలోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో గురువారం నమోదైన పగటి ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.
సింగరేణి ప్రాంతాల్లో ప్రభావం అధికం..
పారిశ్రామిక ప్రాంతాలు, సింగరేణి ఏరియాల్లో భానుడి ప్రతాపం అధికంగా కనిపించింది. ప్రధానంగా కొత్తగూడెం థర్మల్ విద్యుత్తు కేంద్రమైన పాల్వంచ, బొగ్గు గనులు కొనసాగుతున్న కొత్తగూడెం, సింగరేణి, ఇల్లెందు, మణుగూరు ఏరియాలతో పాటు సత్తుపల్లిలో మిగతా ప్రాంతాలతో పోల్చిచూస్తే ఒకట్రెండు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. దీంతో పట్టణాల్లో రహదారులన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపించాయి.