భద్రాచలం అనగానే గుర్తొచ్చేది.. సీతారామస్వామి ఆలయం. పరమ పవిత్రమైన గోదావరి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైన భద్రాద్రి క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించిన చాలు.. చేసిన పాపాలన్నీ పటాపంచలై స్వామి వారి కృపకు పాత్రులవుతారు. రామ నామం జపించినా చాలు ముక్తిమార్గం కలుగుతుంది.
అంతటి పరమ పావన క్షేత్రం కొలువైన భద్రాచలంలో డంపింగ్ యార్డుకు స్థలం కరవైంది. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలంలోని రెండు కాలనీలతో పాటు చుట్టుపక్కల ఉన్న 5 గ్రామ పంచాయతీలు తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైన విషయం తెలిసిందే.
గతంలో పట్టణంలోని చెత్తను పారబోసే డంపింగ్ యార్డు ప్రాంతం కూడా ఏపీలో కలిసింది. దీంతో రోజువారీ ఉత్పత్తి అవుతున్న చెత్తనంతా గోదావరి స్నానఘట్టాలకు కొద్ది దూరంలోనే నది కరకట్టపై ఏళ్లుగా పారబోస్తున్నారు. దీంతో ఈ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. పందులకు నిలయంగా మారింది.
భారీ వర్షాలకు, నది ఉద్ధృతంగా ప్రవహించినప్పుడు ఈ చెత్తంతా నీటిలో కలిసి నది కలుషితమవుతోంది. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు పవిత్ర గోదావరిలో స్నానమాచరించాలనుకుంటే.. ఆ నీళ్లు దుర్గంధంతో నిండిపోతున్నాయి. తమ సెంటిమెంట్‌ను వదులుకోలేక.. ఆ మురికి నీళ్లతోనే స్నానం చేయడం వల్ల చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు.
ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి తాకిడి తగ్గడం వల్ల పెద్దఎత్తున భక్తులు స్వామి దర్శనానికి వస్తున్నారు. కానీ.. ఇటీవల కురిసిన వర్షాలకు నది కరకట్టపై పేరుకుపోయిన చెత్తంతా నదిలోకి చేరింది. గోదావరి నీళ్లన్ని దుర్వాసన వస్తున్నాయి. వాటితో స్నానం చేయలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి.. భద్రాచలం పట్టణంలో ఓ డంపింగ్ యార్డును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆహ్లాదకరంగా ఉండాల్సిన ఆధ్యాత్మిక ప్రాంగణానికి.. దుర్గంధం నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.