గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్, స్థానిక అధికారులపై ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. మణుగూరు మండలం గుట్టమల్లారం, లంకమల్లారం గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
గుట్టమల్లారం పంచాయతీల్లో నూతనంగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్, స్మశానవాటికలు, ప్రకృతి వనాలను పరిశీలించారు. స్మశానవాటిక, డంపింగ్ యార్డుల వివరాలు కార్యదర్శుల వద్ద లేకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి వెంట మొక్కలు ఎందుకు నాటలేదని ప్రశ్నించారు. వారం రోజుల్లో మొక్కలు నాటాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
లంకమల్లారంలో రహదారి వెంట గతేడాది నాటిన మొక్కలు చనిపోవడం పట్ల సర్పంచ్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి సంబంధించిన బిల్లులను సర్పంచ్, కార్యదర్శి నుంచి తిరిగి వసూలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇవీ చూడండి: గోదారమ్మ పరవళ్లు... నిండుకుండల్లా జలాశయాలు