టీఎస్-బీపాస్ విధానంతో పట్టణాల్లో తక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ సర్టిఫికేషన్) ఆధారంగా కేవలం 21 రోజుల వ్యవధిలో నిర్మాణ అనుమతులను మంజూరు చేస్తారు. మీసేవ, పౌరసేవ, వ్యక్తిగత ఇంటర్నెట్, లేదా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తారు. ఆ సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిష్కరించేలా ప్రత్యేక సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
అనుమతుల మంజూరు విధానం
- జూన్, 2 తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ‘టీఎస్-బీపాస్’ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. అవసరమైన ఏర్పాట్లను 15 రోజుల్లో చేపట్టాలని ఉభయ జిల్లాల పురపాలక కమిషనర్లకు ఆదేశాలు అందాయి.
- 75 చదరపు గజాల వరకు విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో నివాస భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. నామమాత్రంగా ఒక్క రూపాయి చెల్లించి తక్షణమే నిర్మాణ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
- 75 చదరపు గజాల నుంచి 239.20 చదరపు గజాల లోపు గ్రౌండ్+1 వరకు (7 మీటర్ల ఎత్తు ఉండే) నివాస భవనాలకు వెంటనే అనుమతి ఇవ్వనున్నారు. దీనికోసం స్థలానికి సంబంధించిన నిజ ధ్రువపత్రాలు, యజమాని వ్యక్తిగత, చిరునామాకు సంబంధించిన పత్రాలు అవసరం.
- 239.20 చదరపు గజాల నుంచి, 598 చదరపు గజాల వరకు ప్లాట్లలో స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతులు రానున్నాయి. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత స్వాధీనతా ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది.
- 598 చదరపు గజాల కన్నా ఎక్కువ, గ్రౌండ్+2 అంతస్తుల కన్నా ఎక్కువ ఉండే ప్లాట్లలో, అన్ని నివాసేతర భవనాలకు ఏకగవాక్ష(సింగిల్ విండో)విధానం ద్వారా అనుమతులు ఇవ్వనున్నారు. ‘టీఎస్-బీపాస్’ కింద ప్రజలు ఒకే ఉమ్మడి(కామన్) దరఖాస్తు చేయవచ్ఛు నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌వోసీ) కోసం ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరం లేదు.
ప్రత్యేక బృందాల నిఘా
‘టీఎస్-బీపాస్’ ద్వారా అనుమతులు తీసుకుని నిర్మిస్తున్న భవనాలపై ప్రత్యేక బృందాల (పోస్ట్ వెరిఫికేషన్ టీం) నిఘా ఉంటుంది. దీనికి కలెక్టర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. నీటిపారుదల, ర.భ. శాఖ, పంచాయతీరాజ్ జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు.
అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసిన సమయంలో సమర్పించిన ప్రణాళిక(ప్లాన్)కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లు ఈ బృందం గుర్తిస్తే.. సంబంధిత నివేదికను పురపాలక కమిషనర్‌కు అందజేస్తుంది. దీని ఆధారంగా అనుమతులు నిలిపివేయాలా? జరిమానా విధించాలా? లేదంటే నిర్మాణాన్నే కూల్చివేయాలా? అనేది నిర్ణయిస్తారు. దరఖాస్తు ఏదైనా స్థలానికి సంబంధించిన ధ్రువపత్రాలు, ప్లాన్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.