ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గోడం నగేష్ గెలుపు బాధ్యతను తెరాస అధిష్ఠానం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి అప్పగించింది. జిల్లాకు చెందిన శాసనసభ్యులు రాఠోడ్ బాపూరావు, విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌లు గోడం నగేష్‌తో అంటీముట్టనట్లు ఉన్నారు. వీరి మధ్య సఖ్యతను కుదిర్చే బాధ్యతను ఇంద్రకరణ్‌రెడ్డికి తెరాస కట్టబెట్టింది.
నేతల్ని ముంచిన అతివిశ్వాసం...
కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్‌తో పాటు, భాజపా నుంచి ఆదివాసీ ఉద్యమనేత సోయం బాపూరావు బరిలో నిల్చారు. ఓట్లు చీలకుండా జాగ్రతలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేసింది. ఓ దశలో అంతర్గతంగా పార్టీ చేయించిన సర్వేల్లో కాంగ్రెస్, భాజాపా అభ్యర్థుల కంటే 7 నుంచి 9 శాతం అధికమైన ఓటింగ్ అనుకూలంగా ఉందనే అతివిశ్వాసం తెరాస నేతల్లో కనిపించింది. గెలుపు ధీమాతో ముందుకెళ్లిన తెరాస అధిష్ఠానానికి క్షేత్రస్థాయిలో వచ్చిన ఫలితం ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లయింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా తెరాస ఓ దశలో మూడోస్థానానికి దిగజారడం పార్టీ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది.
మూడోస్థానానికి పరిమితమైన తెరాస...
భాజపా తరఫున బరిలో నిల్చిన ఆదివాసీ ఉద్యమనేత సోయం బాపురావు... తెరాస అభ్యర్థి గోడం నగేష్‌పై 58వేల 560 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ ముథోల్, బోథ్, ఆదిలాబాద్, నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో భాజపా స్పష్టమైన ఆధిక్యతను చాటుకుంది. మొత్తం 23 రౌండ్ల ఓట్ల లెక్కింపులో దాదాపుగా 15వ రౌండ్ వరకు మొదటి రెండు స్థానాల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులే నిలవగా... తెరాస మూడోస్థానానికి పరిమితమైంది.
ఫలితంపై నేతల నుంచి అధిష్ఠానం ఆరా...
సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఓట్లు కాస్తంతా కలిసిరావడం వల్ల తెరాస రెండోస్థానానికి ఎగబాకింది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్‌తో పాటు ఖానాపూర్ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే సరికి తెరాస అభ్యర్థి గోడం నగేష్ మూడోస్థానానికే పరిమితమయ్యారు. ఖానాపూర్ నియోకవర్గం పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాఠోడ్ మొదటి స్థానంలో నిలిచారు. లోక్‌సభ పరిధిలో ఏడుగురికి ఏడుగురు శాసనసభ్యులు తెరాసకే చెందిన వారైనప్పటికీ... ఫలితం ఎందుకిలా వచ్చిందనేదానిపై అధినేత ఆరాతీయడం... పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా బోథ్, ఖానాపూర్, ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో పార్టీలో అసలేం జరుగుతుందంటూ... ఓ రాష్ట్రస్థాయి నేత... జిల్లాలోని ద్వితీయశ్రేణి నేతల నుంచి వివరాలు సేకరించడం ప్రాధాన్యతాంశంగా మారింది.
గుర్రుగా ఉన్న అధిష్ఠానం...
ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో జరిగిన ప్రతి అంశాన్ని క్రోడీకరిస్తూ... నివేదిక ఇవ్వాలని జిల్లాకు చెందిన ఓ నేతను అధిష్ఠానం ఆదేశించింది. ఓటమి చవిచూసిన గోడం నగేష్ నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లా తెరాసలో ఉన్న వర్గవిబేధాలపై ... అధిష్ఠానం గుర్రుగా ఉండటం పార్టీ వర్గాల్లో ఉత్కంఠతకు దారితీస్తోంది.
ఇదీ చూడండి: ఏపీకి వెళ్లేందుకు 'శ్రీలక్ష్మి' దరఖాస్తు