రాష్ట్రంలో 2018లో ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల ఉపాధ్యాయ శిక్షణ కాలం ఈ ఏడాదితో పూర్తయింది. కరోనా కారణంగా మార్చి 17 నుంచి రాష్ట్రంలో డైట్ కళాశాలలకు పాఠశాల విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఇదే సమయంలో 2019లో ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు విద్యాసంవత్సరం నష్టపోకుండా.. పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతికి ప్రమోట్ చేసింది. కానీ 2018లో ఎంపికైన అభ్యర్థుల శిక్షణ కాలం పూర్తవ్వడం వల్ల తప్పనిసరిగా వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా అవరోధం ఏర్పడింది.
కరోనా కారణంగా..
రాష్ట్రంలో పాత పది జిల్లాల్లోని పది ప్రభుత్వ డైట్ కళాశాలలతో పాటు మరో 70వరకు ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ప్రతి కళాశాలకు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలను పరిగణలోకి తీసుకుంటూ 5వేలకు పైగా ఛాత్రోపాధ్యాయులకు ఉపాధ్యాయ శిక్షణ కాలం పూర్తయింది. వీరందరికీ మార్చి, ఏప్రిల్ మాసాల్లోనే వార్షిక పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిర్వహించలేదు. ఫలితంగా ఉపాధ్యాయ శిక్షణ పూర్తయిందనే మాటేగానీ ఏ ఒక్క అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత ఎంపికైన అభ్యర్థులతో సమానంగానే పరీక్షలు నిర్వహిస్తే ఏడాది సీనియారిటీ నష్టపోవాల్సి వస్తుందనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతున్నప్పటికీ పాఠశాల విద్యాశాఖ పరిగణలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పట్టించుకోని పాఠశాల విద్యాశాఖ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎనిమిది డైట్ కళాశాలలుంటే 500 మందికి ఉపాధ్యాయ శిక్షణ పూర్తయింది. వీరి వార్షిక పరీక్షల నిర్వహణ పట్టించుకోని పాఠశాల విద్యాశాఖ తాజాగా 2020-2022 సంవత్సరానికి చెందిన ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే తాము నడుచుకోవాల్సి వస్తుందనే మాట డైట్ కళాశాలల అధికారుల నుంచి వినిపిస్తోంది.
సర్వత్రా విమర్శలు
బాసర ట్రిపుల్ ఐటీలో చదివిన విద్యార్థులకు కొవిడ్ నిబంధనలకు లోబడి సాంకేతిక విద్యాశాఖ వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంటే.. పాఠశాల విద్యాశాఖ కనీసం వార్షిక ప్రణాళికను కూడా ఖరారు చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చూడండి: సోనా బియ్యం వినియోగం పెంపు కోసం కుదిరిన అవగాహన