కరోనా విలయం అందరి జీవితాలను తారుమారు చేసింది. ఆర్థిక పరిస్థితులను చిన్నాభిన్నం చేసింది. ఇది వరకు కూలీ పనులు చేసుకొని జీవించే వారు సైతం తన కొడుకు ప్రైవేటు బడిలో చదవాలనే ఆకాంక్షతో ఎంత కష్టమైనా చదివించారు. ఫీజుల భారం భరించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో ప్రైవేటులో చదివించలేని పరిస్థితి ఉంది.
నెలవారీ ఫీజులతో పాటు ప్రయాణ ఛార్జీలు భరించడం పేద తల్లిదండ్రులకు కష్టమవుతోంది. మరోపక్క సొంత గ్రామాలు, సమీప పల్లెల్లో ఉన్న సర్కారు బడుల్లోనూ సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. ఉత్తమ విద్యాబోధన, నాణ్యమైన చదువులు ఉండటంతో చాలా మంది ఇటు వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటీవల డిజిటల్ తరగతుల నిర్వహణ చురుగ్గా సాగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సర్కారు బడుల వైపు ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది.
ఫలితంగా జిల్లాలో అనేక పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ బడిలో చేరుతున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 104 పాఠశాలల్లో 547 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో ప్రవేశాలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది.
ఇచ్చోడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 38 మంది విద్యార్థులు చేరారు. సమీప గ్రామాల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే ఈ విద్యార్థులు తాజాగా సర్కారు బడిలో ప్రవేశం తీసుకున్నారు.