ఆ ఊళ్లలో పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలంతా టైమ్‌టేబుల్ కచ్చింతంగా పాటించాల్సిందే... గంట శబ్దాన్ని విన్న తరవాతే అడుగు వేయాల్సింది... ఇది సాధారణ విషయమే కదా అనుకుంటున్నారా! అందులోనే దాగుంది అసలు సమస్య. వారు పాటించేది పాఠశాల టైం టేబుల్కాదు.. వినేది బడిగంట కాదు... రైల్వే టైం టేబుల్.. రైలు కూత. ఆదిలాబాద్ పట్టణం తిర్పెల్లి ఖిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల రైలు పట్టాల ఇవతలి వైపు ఉంది. పట్టాల అవతల ఉన్న తాటిగూడ, క్రాంతినగర్, భాగ్యనగర్ మహలక్ష్మీవాడ, లక్ష్మీనగర్ ప్రాంతాలకు చెందిన పిల్లలు బడికి రావాలంటే దినదినము గండంగా మారింది.
కాలనీలల్లో 25వేలకు పైచిలుకే జనాభా ఉంటుంది. దాదాపుగా అంతా పేదవాళ్లే. పట్టణశివారు ప్రాంతాలుగా ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన విషయం అలా ఉంచితే రాకపోకలు సాగించడమే ప్రధాన సమస్యగా మారింది.
మార్కెట్ యార్డు సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా నేతల హామీలకే పరిమితమైంది. పైగా ఆదిలాబాద్ ప్రధాన మార్కెట్‌కు వచ్చివెళ్లడానికి... ఈ కాలనీలను ప్రధాన మార్కెట్‌కు అనుసంధానం చేయాడానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. కేవలం ఎన్నికలవేళ ఓట్లు వేయడానికి పనికివస్తున్న ఇక్కడి ప్రజలు... రాకపోకలు సాగించడానికి కనీసం రైల్వే వంతెన నిర్మించాలనే డిమాండ్ నెరవేరడంలేదు.
ఇదీ చూడండి: 19 ఏళ్లలో ఆ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది 2 కేసులే!