ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తాన్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. నాగోబా ఆలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు. కేస్లాపూర్ నాగోబా ఆలయం వద్ద నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సోయం బాబూరావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్, ఆలయ కమిటీ అభివృద్ధి సభ్యులు, మెస్రం వంశీయులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
జిల్లా పాలనాధికారి దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ 'ఆదిలాబాద్ జిల్లా మంచి మనసున్న జిల్లా అని అందులోనూ ఆదివాసీల ఆత్మీయత మరువలేనిద' అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా ప్రయత్నిస్తామన్నారు. ఆలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సోయం బాబూరావు దేవాదాయశాఖ మంత్రిని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో పట్టాలు ఉన్న భూముల్లోకి అటవీశాఖ అధికారులు వస్తే ఊరుకునేది లేదన్నారాయన.
ఈ ప్రాంతంలో పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఆదివాసీలు తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ, పిల్లలను ఉన్నత చదువులు చదివించి అన్ని రంగాల్లో రాణించేలా చూడాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. అనంతరం మంత్రి, అధికారులు ప్రజా సమస్యలకు సంబంధించిన పత్రాలు స్వీకరించారు.