అడవులతో అలరారాల్సిన ఆదిలాబాద్ జిల్లా... స్థిరాస్తి వ్యాపారుల అక్రమ భూదందాకు కేంద్రబిందువుగా మారుతోంది. ఆదిలాబాద్ పట్టణంలో స్థిరాస్తి వ్యాపారులుగా అవతరామెత్తిన కొంతమంది బడా వ్యాపారుల దాష్టికానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు భూములనే తేడా లేకుండా.... ఫోర్జరీ సంతకాలతో బినామీ పత్రాలు సృష్టిస్తున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని నిరభ్యంతరంగా పత్రాలు సృష్టిస్తూ... ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 95 అక్రమ లేఅవుట్లు ఉంటే... జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 135 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రధానంగా మావల, బట్టిసావర్గాం, అనుకుంట గ్రామపంచాయతీల పరిధితో పాటు, ఆదిలాబాద్ బల్దియా పరిధిలోని ఖానాపూర్, ఖిల్లా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నట్లుగా అధికార యంత్రాంగం ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది.
ఇటీవల మావల, బట్టిసావర్గాం పరిధిలోని పలు అక్రమ లేఅవుట్లను గుర్తించిన అధికారులు వాటిని కూల్చివేయడం కలకలం సృష్టించింది. ఇప్పటికే ఇక్కడ కోట్లాది రూపాయల స్థిరాస్తి వ్యాపారం జరిగింది. స్థిరాస్తి వ్యాపారుల అక్రమ లేఅవుట్లను కూల్చివేయడమే కాకుండా... వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్పా ఇలాంటి మోసాలు మళ్లీ జరగవనేది సామాన్యుల మాట కాగా... విచారణ తరువాత తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ అసైన్డ్ భూములను ప్లాట్ల కోసం నిరభ్యంతర పత్రాలు జారీచేయడంలో కొంతమంది రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అలాంటి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటే తప్పా... అక్రమ లే అవుట్ల ఆగడాలకు అడ్డుకట్టపడదు.