వినాయకుని ప్రతిమను తయారు చేయడం ఎంత సులువో విఘ్నాలను తొలగించే ఆయనను పూజించడం, ప్రసన్నం చేసుకోవడం కూడా అంతే. నిరాడంబరుడైన ఆయనకు గుప్పెడు గరిక, పిడికెడు ఉండ్రాళ్లు ఉంటే చాలు.. ప్రశాంతంగా పూజించుకుని నిండుగా నైవేద్యం అర్పించవచ్చు. వినాయక చవితి వేళ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నుంచి ఉపశమనం కల్పించమని వేడుకుంటూనే మనలను అనుగ్రహించే బొజ్జ గణపయ్య రూపం పరమార్థాన్ని గ్రహించి ప్రకృతితో మమేకం అయ్యే ఆయన పూజా విధానాన్ని అనుసరించి ఆచరిద్దాం.
బంకమట్టితో తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసిన వినాయకుడు నవరాత్రులు పూజలు అందుకుని చివరకు నీటిలో మిళితం అవుతారు. నీటి నుంచి పుట్టిన మట్టి చివరకు నీటిలో కలిసిన విధంగానే చరాచర జగత్తులో ఎంత గొప్ప వారైనా చివరకు ప్రకృతి ఒడిలోకే చేరాల్సి ఉంటుందని చెప్పడమే దాని పరమార్థం.
ఈ సృష్టిలో ప్రకృతి స్వరూపమైనవాటిలో మట్టి(మృత్తిక) ఒకటి. అలాంటి మట్టి నుంచే సకల జీవులు సృష్టి వాటి పోషణ జరుగుతుంది. ఈ సత్యాన్ని చాటేందుకే పరమశివుడు మట్టితో వినాయకుడిని సృష్టించి దానికి ప్రాణ ప్రతిష్ట చేసినట్టు లింగపురాణం చెబుతోంది. మట్టి అనేది అన్ని చోట్ల దొరుకుతుంది. దానికి పేద, ధనిక తారతమ్యం ఉండదు.తరతమ బేధం లేకుండా ఎవరైనా పూజించుకునే దేవుడుగా కీర్తించబడే గణనాథుడి విగ్రహాలను మట్టితో మాత్రమే తయారు చేయాలనేది అనాదిగా వస్తున్న ఆచారం.
- ముద్దు ప్రదీప్ శర్మ, పురోహితుడు, లక్షెట్టిపేట
పాటించాల్సిన నిబంధనలు ఇవి...
- వినాయక విగ్రహాలను బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ఇళ్లలో గాని ఆలయాల్లో గాని ఏర్పాటు చేసుకోవాలి.
- ఆలయాల్లో ఏర్పాటు చేసిన సందర్భంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు ఏర్పాటు చేసుకోవాలి.మాస్కులు కచ్చితంగా ధరించాలి.
- భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇవ్వకూడదు.
- సామూహిక నిమజ్జనానికి అవకాశం లేనందున ఎవరికి వారుగా ఆర్భాటం లేకుండా నిమజ్జనం చేసుకోవాలి. 3, 5, 9 రోజుల్లో ఎప్పుడైనా నిమజ్జనం చేసే అవకాశం ఉన్నందున అందరూ ఒకే సారి కాకుండా వంతుల వారీగా నిమజ్జనం చేయడం శ్రేయస్కరం.
- మట్టి విగ్రహాలు, అందులోనూ 3 అడుగులకు మించకుండా ఏర్పాటు చేసుకోవడం వల్ల నిబజ్జనం సులువు అవుతుంది.
- మట్టి గణపతులతో భక్తి ప్రపత్తులు చాటుదాం
కరోనాతో మారిన జీవితాలు
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను ఉచితంగా అందజేస్తూ సత్యసాయి సేవా సమితి ఆదర్శంగా నిలుస్తోంది. గడిచిన నాలుగేళ్లుగా ఏటా వినాయక చవితి సందర్భంగా సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకులను తయారు చేయించి విగ్రహాలను ఇలా ఇంటింటికి అందజేస్తున్నారు. పాఠశాలల్లో మట్టి విగ్రహాల తయారీపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి పోటీ నిర్వహిస్తున్నారు. ఇళ్లలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని వాడేలా ప్రోత్సహిస్తున్నారు.

ఈ వ్యక్తి పేరు రెడ్డి మహేష్, చెన్నూరులో ఆర్‌ఎంపీ వైద్యుడు. స్వతహాగా కళాకారుడైన ఆయన 12 ఏళ్లుగా మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా అందజేస్తున్నారు. మొదట్లో ఆసక్తితో మట్టి విగ్రహాలను అందజేసినా పట్టణ వాసుల నుంచి వస్తున్న ఆదరణతో తర్వాత దశలో పర్యావరణ హిత రంగులు అద్ది అందంగా తయారు చేయడం ప్రారంభించారు. ప్రతి ఏటా వంద మందికి ఉచితంగా విగ్రహాలు ఇస్తూ వస్తున్నారు.

ప్రాచుర్యం పొందుతున్న ట్రీ గణేష
పర్యావరణ హితానికి దోహదం చేసే ఇలాంటి ట్రీ గణేష విగ్రహాలకు ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఎలాంటి రసాయనాల అవసరం లేకుండా కేవలం బంక మట్టితో చేసిన విగ్రహంలో మనకు ఇష్టమైన మొక్క గింజలను ఉంచి ప్రతి రోజు పూజించాలి. నవరాత్రులు ముగిసిన తర్వాత మన ఇంటి పెరట్లో ఉంచి నీరు అందిస్తే ఒక మొక్కను నాటిన వారం అవుతాము. ఇలాంటి విగ్రహాల తయారీ, వినియోగంపై నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు ఉచితంగా విగ్రహాలను అందజేస్తున్నారు.

ఇష్టమైన గణపతిని ఇంట్లోనే..!
పర్యావరణానికి హాని కలిగించే రంగుల ప్రతిమలను నెలకొల్పొద్దని ఏటా ప్రచారం చేస్తుంటారు. ప్రకృతికి కలిగే హానిని వివరిస్తుంటారు. ఆలోచించే వారు ఔను.. మట్టి విగ్రహాలనే పూజిద్దామంటుంటారు. ఈసారి కరోనా కాచుక కూర్చోందని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే వినాయకున్ని తయారు చేసుకోండంటూ నిర్మల్‌కు చెందిన చిన్నారులు అక్షరస్ఫూర్తి, అంకుర చక్కగా ప్రచారం చేస్తున్నారు..

ఇవి తీసుకోండి..ఇలా చేయండంటూ
ప్రవీణ్‌కుమార్-రజనీదేవి దంపతుల పిల్లలు అక్షర స్ఫూర్తి, అంకుర ప్రతి సందర్భంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మంచి విషయాలను ప్రజలకు చేరవేసేందుకు యూట్యూబ్ చానల్(me and my cutie pies)ను వేదిక చేసుకొంటారు. తాజాగా గోమయ, పసుపు వినాయకులను తయారు చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. కావాల్సిన వస్తువుల నుంచి తయారు చేసే విధానం వరకు పూసగుచ్చినట్లు వివరిస్తూ తల్లిదండ్రుల సహాయంతో కళ్లముందే పర్యావరణహిత వినాయకులను చూడముచ్చటగా సిద్ధం చేస్తున్నారు. వీరి వీడియోలను వేలాది మంది చూస్తూ మేము సైతం అంటూ ఇంట్లోనే ఇష్టమైన బొజ్జగణపయ్యను సిద్ధం చేసుకుంటున్నారు.

నాడు నృత్య శిక్షకులు.. నేడు హస్త కళాకారులు
నాడు వీరు నృత్య శిక్షకులు.. జాతీయస్థాయి యువజనోత్సవాల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. అనేక రాష్ట్రస్థాయి నృత్య ప్రదర్శనలిచ్చారు. ప్రస్తుతం హస్త కళాకారులుగా మారారు. వారే ఆదిలాబాద్‌కు చెందిన ఈశ్వర్‌సాయి, ఓంసాయి. ఇద్దరు మంచి మిత్రులు. వివరాల్లోకెళ్తే.. ఏటా వేసవి సెలవుల్లో డ్యాన్స్ అకాడమీలో వీరు చిన్నారులకు నృత్యంలో శిక్షణ ఇస్తారు. మిగిలిన కాలాల్లో చిన్నాచితక పనులు చేసి కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈ మార్చిలో లాక్‌డౌన్ అమలు కావడంతో డ్యాన్స్ అకాడమీలు మూతపడ్డాయి. దీంతో వీరు అయిదేళ్ల కిందట నేర్చుకున్న మట్టి ప్రతిమలకు పని పట్టారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా చిట్టి గణపతి ప్రతిమలు తయారు చేయడమే కాకుండా కావాల్సిన వారికి ఉచితంగా ఇంటికి పంపిణీ సైతం చేస్తున్నారు. ఇలా నాడు నేర్చుకున్న కళ నేడు వారికి ఉపాధి పొందేలా చేసింది. అంతే కాదండోయ్.. కరాటే, కర్రసాము, పెయింటింగ్, డ్రాయింగ్, జానపద పాటలు వంటి కళల్లోనూ రాణించి రాష్ట్రస్థాయిలో పలుమార్లు పురస్కారాలు పొందారు.