Freezers not Working in Khanapur Government Hospital in Nirmal : ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో కనీస వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లోని మార్చురీల్లో ఫ్రీజర్లు పని చేయకపోవడంతో మృతదేహాలు గుర్తించలేని స్థితిలో కుళ్లిపోతున్నాయి. దీంతో మృతుల బంధువులు మండిపడుతున్నారు. ఫ్రీజర్లపై సంబంధిత అధికారులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూసింది.
Khanapur Government Hospital Problems : నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయని ఫ్రీజర్‌లో మృతదేహం పెట్టడంతో కుటుంబసభ్యులు మండిపడ్డారు. దిలావార్‌పూర్ గ్రామానికి చెందిన రైతు పోకనకంటి రాజేశ్వర్ అప్పుల బాధతో గురువారం బలవన్మరణానికి పాల్పడ్డారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండకపోవడంతో తన పంట పొలం వద్దే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి కావడంతో మార్చురీకి తరలించి ఫ్రీజర్‌లో పెట్టారు. ఉదయం చూసేసరికి మృతదేహం కుళ్లిన వాసన రావడంతో కుటుంబసభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో మృతదేహం కుళ్లిపోయిందని ఆరోపించారు. పని చేయని ఫ్రీజర్‌లో మృతదేహం పెట్టడం బాధ్యతారాహిత్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.
Water in Jagtial Government Hospital : ఆసుపత్రిలోకి వర్షపు నీరు.. ఇబ్బంది పడుతున్న రోగులు
'మా బావ పోనకంటి రాజేశ్వర్.. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండకపోవడంతో అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. రాత్రి కావడంతో పోస్టుమార్టం చేయకుండా మార్చురీకి తరలించారు. ఉదయం వచ్చి చూసేసరికి శవం కుళ్లిపోయింది. ఆస్పత్రిలో మార్చురీకి సంబంధించిన ఫ్రీజర్‌లు పని చేయకపోవడం వల్ల శవం కుళ్లిపోయింది. ఇంటికి తీసుకెళ్లి అంతక్రియలు చేసుకోవడానికి వీలు లేకుండా.. గుర్తుపట్టకుండా మృతదేహం కుళ్లిపోయింది. అధికారులు స్పందించి.. ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.'-మృతుని బంధువు
Govt Hospital Problems : ఆ దవాఖానాకు వెళ్లాలంటేనే జంకుతున్న జనాలు.. వైద్యులదీ అదే పరిస్థితి!
తరచూ ఇలాగే..: ఖానాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచుతున్న మృతదేహాలు కుళ్లిపోతుండటంతో మృతుల బంధువులు ఆగ్రహానికి లోనవుతున్నారు. కొంతకాలంగా ఫ్రీజర్లు పని చేయకపోవడంతో మృతదేహాలను ఫ్రీజర్‌లో పెట్టేందుకు అవకాశం లేకుండాపోయింది. దీంతో చాలా సందర్భాల్లో ఆరు బయటే మృతదేహాలను ఉంచాల్సిన పరిస్థితి వస్తోంది. ఆసుపత్రిలోని రోగులు, మృతుల బంధువులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మృతదేహాల నుంచి వచ్చే దుర్వాసనతో రోగులు, కుటుంబసభ్యులు నరకం చూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆస్పత్రిలో మార్చురీ ఫ్రీజర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Costliest MBBS Colleges In India : దేశంలోనే అత్యంత ఖరీదైన MBBS డిగ్రీ.. ఆ కాలేజీలో ఫీజు రూ.కోట్లలో!