ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 60 మత్స్యకారుల సంఘాలు ఉండగా.. 4030 మంది సభ్యులున్నారు. వీరి ఉపాధి నిమిత్తం మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టులతో పాటు మరో 267 చెరువుల్లో ఏటా కోటికి పైగా చేప పిల్లలను వదులుతున్నారు. అవి పెరిగిన తర్వాత దళారుల ప్రమేయం ఉండటంతో.. మత్స్యకారులు నష్టపోతున్నారు. జిల్లాలో రూ.52 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నా.. చేపలు విక్రయించేందుకు మాత్రం మార్కెట్లు, నిల్వ చేసేలా శీతల గిడ్డంగులు, ఎగుమతి చేసుకునేందుకు వాహనాలు లేక చేపలను తక్కువ ధరకే దళారులకు విక్రయించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. జాలర్ల నుంచి ఒక కిలోకు రూ.50 నుంచి రూ.60 లకే కొనుగోలు చేసిన దళారి, బయట మాత్రం రూ.180 నుంచి రూ.200లకు పైగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
వారిదే పెత్తనం..
జాలర్లపై దళారుల పెత్తనం కొనసాగుతోంది. ప్రాజెక్టులు, చెరువుల్లో ప్రభుత్వం చేప పిల్లలను వదలగానే వాటి పరిధుల్లో.. మత్స్యకారుల సంఘాలను దళారులు మభ్యపెట్టి లీజుకు తీసుకుంటున్నారు. చెరువు విస్తీర్ణం, నిల్వ సామర్థ్యం తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని, చెరువులకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు, ప్రాజెక్టులకు రూ.6 నుంచి రూ.8 లక్షల వరకు లీజుకు తీసుకుంటున్నారు. నాలుగు నెలలు గడిచిన తర్వాత చేపలు పట్టి ఇచ్చినందుకు జాలర్లకు ఒక కిలోకు రూ.60 మాత్రమే చెల్లించి, మిగతా లాభామంతా వారే తీసుకుంటున్నారు.
ప్రస్తుతం మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టులను కరీంనగర్‌కు చెందిన ఓ వ్యాపారి తక్కువకే లీజుకు తీసుకుని, కిలోకు ఇంత ధర అని నిర్ణయించి.. చేపలను భారీ వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి, రెట్టింపు అంతకంటే ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం పూర్తి రాయితీపై చెరువుల్లో వదిలిన చేప పిల్లలు పెరిగిన తర్వాత లీజు కాకుండా. జాలర్లే పట్టుకుని, అమ్ముకుంటే ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మార్కెట్ సౌకర్యంతో ఎగుమతి చేసేందుకు వాహనాలు ఇతర వసతులు కల్పిస్తే దళారుల ప్రమేయం తగ్గి, మత్స్యకారులు అభివృద్ధి చెందుతారు.
ప్రతిపాదనలు చేశాం..
ఆదిలాబాద్‌లో మార్కెఫట్, శీతల గిడ్డంగుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపించాం. ప్రస్తుతం పరిశీలనలో ఉంది. జిల్లాలో ఎక్కడా కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా చూస్తాం.
--- - విజయ్‌కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి
జిల్లా వివరాలు ఇలా..
మత్స్యకార సంఘాలు: 60
సభ్యులు: 4030
జలాశయాలు : రెండు (మత్తడివాగు, సాత్నాల)
చెరువులు: 267
ఇదీ చూడండి: Gandhi Hospital Rape: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం... పోలీసుల అదుపులో నలుగురు