రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనాపగ్గాలు చేపట్టిన తెరాస ప్రభుత్వం.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోంది. 2018 జనవరి 1 నుంచి కార్యక్రమం అమలు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షా 38 వేల 458 వ్యవసాయ కనెక్షన్లకు నిరంతరాయంగా లబ్ధి చేకూరింది. ఇటీవల ఖరీఫ్‌లోని వాతావరణ పరిస్థితులు, భౌగోళిక స్థితిగతుల కారణంగా పంటల సాగుకు విద్యుత్ వాడకం అంతగా అవసరం రాలేదు. దీన్ని గమనించిన సంస్థ.. విద్యుత్ ఆదా చేసే ప్రయత్నం చేపట్టింది.
ప్రధానంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విద్యుత్ వినియోగం అధికంగా ఉండే సమయంలో.. వ్యవసాయానికి ఆరు గంటల కోత విధించే విధానాన్ని అమలు చేస్తోంది. వరంగల్ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం కేంద్రంగా.. ఆయా జిల్లాలోని ఆ శాఖ అధికారులకు సాయంత్రం 4 గంటల సమయంలో, తిరిగి రాత్రి 10 గంటల 45 నిమిషాలకు చరవాణికి సమాచారం పంపిస్తున్నారు. త్రీ ఫేజ్ సరఫరాను నిలిపివేయడం, తర్వాత పునరుద్ధరించే అంతర్గత విధానం అమలు చేస్తుండటం వల్ల ఉచిత విద్యుత్ సరఫరా 18 గంటలకే పరిమితమైంది.
తాజాగా రబీ పంటల కోసం నీరు పెట్టేందుకు యత్నించిన రైతులకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సరఫరా ఉండదని తెలిసి ఆందోళన చెందుతున్నారు. రాత్రి 11 గంటల తర్వాత పొలానికి వెళ్లాలంటే మళ్లీ రాష్ట్రం ఆవిర్భావానికంటే ముందటి పరిస్థితే ఎదురవుతోందని రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక వ్యవసాయ కనెక్షన్లు కలిగిన నిర్మల్, మంచిర్యాల జిల్లాలో విద్యుత్ కోత ఇబ్బంది ఎక్కువగా ఉంది. రాత్రిపూట కోత విధించకుంటే వినియోగం పెరిగి ఆర్థికంగా భారమవుతుందనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?