తెరాస నేతల తీరు పట్ల ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్న నిధులతో రైతు వేదికలు నిర్మిస్తూ.. మా నిధులేనంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లా గుండా వెళ్తున్న జాతీయ రహదారి అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
ఈ రహదారి పనుల ప్రారంభానికి గతంలో ఉన్న తెరాస ఎంపీ నగేష్ తానే కారణమని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని సోయం పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ.44 కోట్లు విడుదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీరు పైనా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి రైతు వేదికల నిర్మాణాలు చేపడుతూ.. ఆ భవనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ఎమ్మెల్యేల చిత్రాలను గీయించడమేంటని ప్రశ్నించారు. ప్రజలంతా గమనిస్తున్నారని, ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: జోగులాంబ ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు