టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. పురుషుల బ్యాడ్మింటన్ SL3 విభాగంలో స్వర్ణం సాధించి ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ప్రమోద్ భగత్ రికార్డు సృష్టించాడు. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెథెల్‌పై వరుస సెట్లలో విజయం సాధించి.. ప్రమోద్ నూతన చరిత్ర లిఖించాడు. పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయుడిగా ఖ్యాతి గడించాడు. ఇదే విభాగంలో కాంస్య పతక పోరులో మనోజ్ సర్కార్ కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. జపాన్‌కు చెందిన ఫుజిహారాపై మనోజ్ విజయం సాధించాడు.
45 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో ప్రపంచ రెండో ర్యాంకు ఆటగాడు బెథెల్‌పై 21-14 21-17 తేడాతో.. ప్రపంచ నెంబర్ వన్ అయిన ప్రమోద్ విజయం సాధించాడు. ఫైనల్‌లో గొప్ప మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించిన ప్రమోద్.. ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా పసిడి ఒడిసిపట్టాడు.
నాలుగేళ్ల వయసులో పోలియో బారినపడ్డ ప్రమోద్ భగత్.. ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని క్రీడా దిగ్గజంగా ఎదిగాడు. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ బంగారు పతకాలను సాధించి ప్రమోద్ భారత్ కీర్తి పతాకను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. 33 ఏళ్ల ప్రమోద్ భగత్.. 45 అంతర్జాతీయ పతకాలతో దేశంలో అత్యుత్తమ పారా షట్లర్‌లలో ఒకడిగా ఎదిగాడు.
బ్యాడ్మింటన్‌లో ఈ రెండు మెడల్స్‌తో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 17కు చేరింది. అందులో 4 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్య పతకాలున్నాయి. 1968 నుంచి 2016 వరకు పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 12.. అయితే ఈ టోక్యో ఒలింపిక్స్‌లోనే 17 మెడల్స్‌ను భారత్ గెలుచుకోవడం విశేషం.
ఈ సందర్భంగా స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్.. కాంస్య పతక విజేత మనోజ్ సర్కార్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు.
ప్రమోద్ భగత్.. దేశ ప్రజలందరి మనసులను దోచాడు. అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. అతడి విజయం లక్షలాది మందిని ప్రేరేపిస్తుంది. బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించినందుకు ఆయనకు అభినందనలు. ప్రమోద్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలను సాధించాలని ఆశిస్తున్నాను.
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
"మనోజ్ సర్కార్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దేశం కోసం పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకాన్ని సాధించిన అతడికి నా అభినందనలు. అతడి భవిష్యత్ ప్రణాళికల కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని మోదీ ట్వీట్ చేశారు.