మణిపురి గడ్డపైన పుట్టిన అనితాచాను వెయిట్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. తన కెరీర్ ముగిసినా.. భారత్‌ని గర్వపడేలా చేసే ఎందరో క్రీడాకారులని తయారు చేయాలనుకుంది అనిత. ఆ లక్ష్యంతోనే ఉత్తర మణిపుర్‌లోని లువాన్‌సంగ్బామ్ ప్రాంతంలో 'అనితాచాను వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ'ని నెలకొల్పింది.
నైపుణ్య శిక్షణ..
పేద క్రీడాకారులకు పోషకాహారం, నైపుణ్యాలు ఉచితంగా అందించాలనే దీన్ని స్వచ్ఛంద సంస్థగా ప్రారంభించింది. ఒలింపిక్స్‌లో పతకాన్ని గెలిచే ఒక్క క్రీడాకారిణినైనా తయారు చేయాలనేది తన జీవితాశయం. బీజింగ్ ఒలింపిక్స్ పోటీలకు కోచ్‌గా వెళ్లిన అనితాచాను ఇంగ్లిష్‌రాక వెనుతిరగాల్సి వచ్చింది. ఆ తర్వాతే మరింత పట్టుదలతో శిష్యులకు శిక్షణనివ్వడం మొదలుపెట్టింది. అదే సమయంలో మీరాచాను ఆమె కంటపడింది. జీతం సరిపోక.. తండ్రి పొలం పనులకు వెళ్తే అతనికి తోడుగా వెళ్లేది మీరా. అక్కడి నుంచి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అకాడమీకి రావాలంటే చాలా సమయం పట్టేది. కానీ ఆ ఆలస్యాన్ని ప్రేమతోనే క్షమించేసేది అనిత. క్రమశిక్షణకు మారుపేరైన అనిత శిష్యురాలి కష్టాన్ని అర్థం చేసుకుని ఆమె నైపుణ్యాలకు పదును పెట్టింది. స్థానిక వనరులతోనే ఆమె అందించిన శిక్షణ మీరాని అత్యుత్తమ క్రీడాకారిణిగా మలిచింది. పదేళ్లు మీరా ఆ అకాడమీలోనే శిక్షణ తీసుకుంది.
'దేశం గర్వపడేలా మీరా రాణించింది. రియో ఒలింపిక్స్‌తో పోలిస్తే తడబాటు లేదు. బార్‌ని వేగంగా అందిపుచ్చుకొని.. బరువుని కాళ్ల మధ్యలో బ్యాలెన్స్ చేయడంలో సక్సెస్ అయ్యింది' అంటూ శిష్యురాలి విజయాన్ని చూసి మురిసిపోతోన్న అనిత 2010లో ధ్యాన్‌చంద్ అవార్డుని అందుకుంది.
స్ఫూర్తిదాత..
మీరా తొమ్మిదేళ్ల వయసులో ఒలింపిక్స్ పోటీలో కుంజరాణీ దేవి పెర్‌ఫార్మెన్స్‌ని చూసిన తర్వాత ఆమెలా విశ్వవేదికపై నిలవాలనుకుంది. తనలా అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. దేశానికి ఎందరో అంతర్జాతీయ క్రీడాకారిణులను ఇచ్చిన ఘనత మణిపుర్ది. ఆ నేలలో ఇంతటి స్ఫూర్తిని నింపిన గొప్పదనం కుంజరాణీదేవిదే. తను కోచ్‌గా మారి వందమంది అంతర్జాతీయ క్రీడాకారులని తయారుచేసింది. పద్మశ్రీ, అర్జున అవార్డులని అందుకున్న కుంజరాణి.. మీరా అంతర్జాతీయంగా ఎదిగేందుకు స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందించింది.
ఇవీ చదవండి: