పీవీ సింధు.. ఇప్పుడు దేశంలో మారుమోగిపోతున్న పేరు ఇది. టోక్యో ఒలింపిక్స్‌లో ఈ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాంస్యం సొంతం చేసుకుని దేశానికి మరో మెడల్‌ను అందించింది. ఈ క్రమంలో సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సింధు గురించిన పలు ఆసక్తికర విషయాలు మీకోసం..
వారూ అథ్లెట్లే..
సింధు తల్లిదండ్రుల పేర్లు పీవీ రమణ, పీ విజయ. వారిద్దరు కూడా అథ్లెట్లు కావడం విశేషం. జాతీయ స్థాయిలో వాలీబాల్ జట్టుకు వారు ప్రాతినిధ్యం వహించారు. 2000లో పీవీ రమణ అర్జున అవార్డును కూడా దక్కించుకున్నారు. తల్లిదండ్రులకు తగ్గట్టుగానే సింధు కూడా క్రీడలవైపు ఆసక్తి కనబరిచింది.
120 కిలోమీటర్ల ప్రయాణం..
యుక్తవయస్సులోనే బ్యాడ్మింటన్‌వైపు అడుగులు వేసింది సింధు. తల్లిదండ్రుల అండతో కలను నిజం చేసుకోగలిగింది. సింధును ఉదయాన్నే 3 గంటలకు పుల్లెల గోపీచంద్ అకాడమీకి తీసుకెళ్లేవారు రమణ. ఇది 12ఏళ్ల పాటు సాగింది. అందుకు వారు రోజుకు 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది.
సొదరి పెళ్లి..
సింధు సోదరి పీ దివ్య వివాహం 2012లో హైదరాబాద్‌లో జరిగింది. ఆ సమయంలోనే సయ్యద్ మోదీ అంతర్జాతీయ ఇండియా గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్మమెంట్.. లఖ్‌నవూలో జరిగింది. ఫైనల్‌కు చేరుకున్న 17ఏళ్ల సింధు.. సోదరి వివాహానికి హాజరుకాలేకపోయింది.
ఫోన్ లేకుండా మూడు నెలలు..
2016 రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచిన సింధు.. ఆ ఘనత సాధించిన భారత తొలి బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ కోసం కఠోర శిక్షణ తీసుకుంది సింధు. అందులో భాగంగా.. సింధు ఫోన్‌ను కోచ్ పుల్లెల గోపీచంద్ మూడు నెలల పాటు తన దగ్గరపెట్టుకున్నారు. ఒలింపిక్స్‌లో సత్తా చాటిన తర్వాత గోపీచంద్ నుంచి ఆమె తన ఫోన్ తీసుకుంది.
సచిన్ గిఫ్ట్..
రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధుకు ఎన్నో అవార్డులు, బహుమతులు లభించాయి. వాటిల్లో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ఇచ్చిన గిఫ్ట్ ప్రత్యేకంగా నిలిచిపోయింది. బీఎండబ్ల్యూ కారును ఆయన సింధుకు కానుకగా ఇచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
స్విమ్మింగ్ కూడా..
శిక్షణ లేని సమయంలో పీవీ సింధు స్విమ్మింగ్ చేస్తుంది. ప్రశాంతత కోసం యోగా, మెడిటేషన్ కూడా చేస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
పెద్ద ఫుడీ...
పీవీ సింధు పెద్ద ఫుడీ. ఈ విషయం ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోలను చూస్తే అర్థమవుతుంది. పెరుగంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో సింధు చెప్పింది. 2016 ఒలింపిక్స్ కోసం పెరుగును పక్కన పెట్టింది.
ఇదీ చూడండి:- సింధుకు ఒలింపిక్ పతకం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రశంసలు