సుమిత్ నగల్.. ఈ పేరు ప్రస్తుతానికి ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఈ ఆటగాడికి మంచి భవిష్యత్ ఉందని అంటున్నాడు టెన్నిస్ దిగ్గజం ఫెదరర్. అతి పిన్న వయసులో యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత పొందిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు సుమిత్. తొలి రౌండ్లో ఫెదరర్‌తో తలపడి ఓటమిని చవిచూశాడు.
సుమిత్‌పై ఫెదరర్ 6-4, 1-6, 2-6, 4-6 తేడాతో విజయం సాధించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ నగల్ భవిష్యత్‌లో గొప్ప ఆటగాడవుతాడని కితాబిచ్చాడీ టెన్నిస్ దిగ్గజం.
"సుమిత్‌కు మంచి కెరీర్ ఉంది. మొదటి సెట్లో ఆశ్చర్యకరమైన ప్రదర్శన కనబర్చాడు. ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేయడం వీలుకాదు. ఇలాంటి స్టేజిపై ఆడటం మరింత కష్టం. కానీ సుమిత్ బాగా ఆడాడు".
-ఫెదరర్, టెన్నిస్ ఆటగాడు
ఆ ఘనత సాధించిన నాలుగో ఆటగాడు...
ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను గెలిచిన సుమిత్ 20 ఏళ్లలో గ్రాండ్‌స్లామ్‌లో ఒక సెట్ గెలిచిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అదీ ఫెదరర్ లాంటి దిగ్గజ ఆటగాడిపై గెలవడం మరో విశేషం. ఇది అతడికి 20 గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన ఆనందాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
సుమిత్ నగల్ కంటే ముందు సోమ్‌దేవ్ వర్మన్, యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేనీ.. గ్రాండ్‌స్లామ్‌లో ఒక సెట్ గెలిచిన భారత టెన్నిస్ ఆటగాళ్లుగా ఘనత సాధించారు.
ఇవీ చూడండి.. కరీబియన్ సముద్రంలో భారత క్రికెటర్ల షికారు