వింబుల్డన్ టైటిల్ ఫేవరెట్ సెరెనా విలియమ్స్‌కు భారీ జరిమానా విధించారు అధికారులు. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ కోర్టులలో ఒకదాన్ని తన రాకెట్‌తో పాడుచేయడమే కారణమని వెల్లడించారు. ఫలితంగా 7సార్లు ఛాంపియన్ షిప్ గెలిచిన ఈ టెన్నిస్ ప్లేయర్... దాదాపు రూ. 6 లక్షల 85 వేలు (10వేల డాలర్లు) జరిమానా కట్టాల్సిందిగా ఆదేశాలు అందాయి.
జూన్ 30న ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న సెరెనా... రాకెట్‌తో టెన్నిస్ కోర్టును ధ్వంసం చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఒక క్రీడాకారిణిగా ప్రవర్తించలేదని ఆరోపించారు. దీనిపై విలియమ్స్ వివరణ ఇచ్చింది.
"నిజంగా ఇలాంటి ఘటన ఎదురవుతుందని ఊహించలేదు. ఆ రోజు నా రాకెట్‌ను విసిరానంతే. దానికే ఫైన్ పడింది".
--సెరెనా విలియమ్స్, టెన్నిస్ తార.
గతంలోనూ కోర్టు పాడు చేసినందుకు ఇదే విధంగా ఫైన్ ఎదుర్కొంది సెరెనా. నేడు జరగనున్న సెమీఫైనల్లో అమెరికన్ క్రీడాకారిణి అలిసన్ రిస్కేతో తలపడనుంది.