ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ను(Nadal) మట్టికరిపించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ ఇప్పటివరకు 13 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు.
దాదాపు నాలుగు గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో 3-6, 6-3, 7-6(7/4), 6-2 తేడాతో విజయం సాధించాడు జకోవిచ్. తద్వారా రొలాండ్ గారోస్‌లో(French Open) నాదల్‌ను రెండు సార్లు ఓడించినా ఏకైక ఆటగాడిగా నిలిచాడు. తర్వాత జరగబోయే ఫైనల్లో గ్రీస్ టెన్నిస్ ప్లేయర్ స్టెఫానో సిట్సిపాస్‌తో తలపడనున్నాడు.
తొలిసారి ఫైనల్‌కు
గ్రీస్ కుర్రాడు సిట్సిపాస్ అదరగొట్టాడు. అతడు తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం నువ్వానేనా అన్నట్లు అయిదు సెట్ల పాటు సాగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో అయిదో సీడ్ సిట్సిపాస్ 6-3, 6-3, 4-6, 4-6, 6-3తో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్ మూడున్నర గంటలకు పైగా సాగింది.
ఇదీ చూడండి: French Open: 52వ ప్రయత్నంలో ఫైనల్‌కు!