భారత దేశ డోపింగ్ సంస్థపై సంచలన నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా). నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ(ఎన్‌డీటీఎల్) అధికారిక గుర్తింపును ఆర్నెళ్లు రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఒలింపిక్స్‌కి మరో ఏడాదే గడువు ఉన్న సమయంలో వాడా తీసుకున్న నిర్ణయం కలవరపెడుతోంది. దేశీయంగా డోపింగ్ నిరోధం పట్ల తీసుకుంటున్న చర్యలకు ఇది పెద్ద సమస్యగా మారనుంది.
కారణమిదే...!
అంతర్జాతీయ ప్రమాణాలను ఎన్‌డీటీఎల్ అందుకోవట్లేదని పేర్కొంటూ గుర్తింపు రద్దుకు సూచించింది వాడా. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయాలు వెల్లడైనట్లు స్పష్టం చేసింది.
" వాడా ల్యాబొరేటరీ నిపుణుల బృందం మేలో తనిఖీలు ప్రారంభించింది. తర్వాత ఓ స్వతంత్ర క్రమశిక్షణా కమిటీతో దర్యాప్తు నిర్వహించాం. ఆ నివేదికల ఆధారంగానే.. కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎన్‌డీటీఎల్‌పై ఆర్నెళ్ల నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది"
-- అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ
వాడా నిషేధాన్ని సవాల్ చేస్తూ ఎన్‌డీటీఎల్ 21 రోజుల్లోగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్)ను ఆశ్రయించే వెసులుబాటు ఉంటుంది. ఈ సంచలన నిర్ణయంతో నాడా బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని స్పోర్ట్స్ లాయర్ పార్థ గోస్వామి తెలిపారు. ఒలింపిక్స్‌కి ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్నప్పుడు బడ్జెట్ ఎంతో కీలకమని ఆయన వెల్లడించారు.
ఈ వేటు వల్ల బీసీసీఐ కష్టకాలం ఎదుర్కోనుంది. భారత్‌లో గుర్తింపు పొందిన ఏకైక ల్యాబ్.. ఎన్‌డీటీఎల్ అవడం వల్ల బీసీసీఐ తమ నమూనాలను ఇక్కడికే పంపేది.
ఇలా చేస్తే వేటు తప్పుతుంది...!
ప్రయోగశాలల్లో వివిధ దశల్లో ఉన్న నమూనాలను.. గుర్తింపు పొందిన ఇతర ల్యాబ్‌లకు పంపాల్సి ఉంటుంది. వాడా సూచనల ఆధారంగా ఎన్‌డీటీఎల్‌ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చి దిద్దితే.. నిషేధ కాలం పూర్తయ్యేలోగా మళ్లీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ తాజా నిర్ణయంతో డోప్ పరీక్షలు నిర్వహించుకునేందుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా)కు ఎలాంటి ఆటంకం ఉండదని అధికారులు భావిస్తున్నారు. కానీ సేకరించిన నమూనాలకు ఇతర దేశాల్లో గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.