టోక్యో ఒలింపిక్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరిపై వేటు పడే అవకాశాలున్నాయి. అతణ్ని శుక్రవారం ఆ పదవి నుంచి తప్పించనున్నారని సమాచారం. ఇటీవల మహిళల పట్ల అతను అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. ఆడవాళ్లు చాలా అతిగా మాట్లాడతారని, శత్రుత్వ భావం వాళ్లకు ఎక్కువగా ఉంటుందని ఓ సమావేశంలో మోరి చెప్పినట్లు తెలిసింది.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం వల్ల క్షమాపణ చెప్పిన అతను.. తన పదవికి రాజీనామా చేసేందుకు మాత్రం అంగీకరించలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతణ్ని పదవి నుంచి తప్పించాలనే వాదనకు బలం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అతనిపై చర్యలు తీసుకునేందుకు నిర్వాహక కమిటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రద్దు చేయాలని కోరుతూ..
ఈ ఏడాది జులై 23న ఒలింపిక్స్ ఆరంభంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఏడాది పాటు వాయిదా పడ్డ ఈ క్రీడలను మళ్లీ వాయిదా వేయాలని లేదా రద్దు చేయాలని 80 శాతానికి పైగా జపాన్ ప్రజలు కోరుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది.
ఇదీ చూడండి: హెచ్సీఏలో ఇష్టారాజ్యం- జట్టు ఎంపికలో పెద్దల జోక్యం