దేశానికి ఎన్నో గొప్ప విజయాలు సాధించి పెట్టిన స్ప్రింట్ దిగ్గజం 91 ఏళ్ల మిల్కా సింగ్(Milkha Singh) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకుంటున్న ఆయన ఆరోగ్యం శుక్రవారం ఒక్కసారిగా క్షీణించింది. జ్వరంతో పాటు ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల అత్యవసర చికిత్సా విభాగం (ఐసీయూ)లో వైద్యం అందించారు. అయినా ఫలితం లేకపోయింది. రాత్రి 11.30కు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల క్రీడాలోకంతో పాటు పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మిల్కా కెరీర్‌ను ఓసారి గుర్తుచేసుకుందాం.
- దేశ విభజన సమయంలో కుటుంబం మొత్తం కళ్ల ముందే ఊచకోత.. పాకిస్థాన్ నుంచి కట్టుబట్టలతో భారత్‌కు రాక.. టీనేజీలో దొంగగా ముద్ర.. సీన్ కట్ చేస్తే.. ఆయనో పరుగుల వీరుడు.. 400 మీటర్ల రేసులో ప్రపంచ రికార్డు.. ఫ్లయింగ్ సిక్కు అంటూ పాకిస్థాన్ రాష్ట్రపతి చేత ప్రశంసలు అందుకున్నారు.
- 1929 నవంబరు 20న పంజాబ్‌లోని గోవిందపురా(ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో జన్మించారు మిల్కా సింగ్. టీనేజీలో పాకిస్థాన్ నుంచి వలసవచ్చిన మిల్కా.. శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నారు. అనంతరం భారత సైనిక దళంలో చేరి.. ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్లో తానేంటో నిరూపించుకున్నారు.
- 1958 ఆసియా క్రీడల్లో పాల్గొని 200 మీటర్ల విభాగంలో స్వర్ణం నెగ్గారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందే 400 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డు నమోదు చేసిన ఆయన.. 1956 విశ్వక్రీడలకు అర్హత సాధించారు. అయితే ఈ పోటీల్లో అంతగా ఆకట్టుకోలేకపోయారు. అనంతరం 1958లో జరిగిన ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గి ప్రపంచ వేదికపై భారత్ జెండాను ఎగురవేశారు.
- 1960 రోమ్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం చేజార్చుకున్నారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో మళ్లీ సత్తాచాటారు. 400మీటర్లు, 4X400 మీటర్ల రిలేలో పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. క్రీడల్లో మిల్కా సింగ్ కృషికిగాను 1959లో భారత ప్రభుత్వం.. పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
- 400 మీటర్ల రేసులో మిల్కా సింగ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అప్పటివరకున్న 45.9 సెకన్ల రికార్డు బ్రేక్ చేస్తూ, కొత్త టైమింగ్‌ను(45.8 )నెలకొల్పారు. జాతీయ స్థాయిలో ఈ రికార్డును 2006 వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోవడం విశేషం.
- మిల్కాసింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో 'భాగ్ మిల్కా భాగ్' చిత్రాన్ని రూపొందించారు. 2013లో విడుదలైందీ సినిమా. ఇందులో ఫర్హాన్ అక్తర్.. మిల్కా పాత్ర పోషించారు. ఇందులోని పాత్రకుగాను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడిగా నిలిచాడు ఫర్హాన్. పలు అవార్డులనూ అందుకుందీ చిత్రం.