ప్రతిఏటా జరిగే అత్యున్నత క్రీడా పురస్కారాల నామినేషన్ల దరఖాస్తులను కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. గతేడాది లాగే ఈ సారీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాదీ కూడా స్వీయ నామినేషన్ ప్రక్రియకు అవకాశం కల్పిస్తున్నట్లు క్రీడామంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
"కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఆన్లైన్లోనే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో గతేడాది తొలిసారిగా స్వీయ నామినేషన్లకు అవకాశాన్ని కల్పించాం. అలాగే ఈ ఏడాదీ స్వయంగా నామినేట్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నాం. జాతీయ క్రీడా సమాఖ్యలూ క్రీడాకారులను ఈ పురస్కారాలకు నామినేట్ చేయోచ్చు".
- క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటన
సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వాలి. అయితే ఈసారి దరఖాస్తు సమర్పించేందుకు జూన్ 21 చివరితేదీగా క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది. గతేడాది జాతీయ క్రీడా పురస్కారాల కోసం 74 మందిని ఎంపికచేశారు.
రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షలు, అర్జున అవార్డు గ్రహీతలకు రూ.15 లక్షలు, ద్రోణాచార్య (జీవితకాలం) పురస్కారానికి రూ.15 లక్షలు, ధ్యాన్‌చంద్ అవార్డు విజేతలకు రూ.10 లక్షలతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు.
ఆగస్టు 29న భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి సందర్బంగా వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన ఆటగాళ్లు, కోచ్‌లకు ఈ పురస్కారాల్నికేంద్రం అందజేయనుంది.
ఇదీ చూడండి.. వచ్చే ఆసియాకప్ పాక్‌లో.. టీమ్ఇండియా వెళ్తుందా?