కరోనా కారణంగా భారత క్రీడా ప్రాధికార సంస్థ(శాయ్) కేంద్రాలను ఇటీవలే మూసివేశారు. ప్రస్తుతం ఈ వైరస్‌తో బాధపడుతున్న వారికి ఐసోలేషన్ కేంద్రాలుగా ఈ కార్యాలయాలను ఉపయోగించనున్నట్లు శాయ్ ఆదివారం తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విన్నపం మేరకు అన్ని సాయ్ ప్రాంతీయ కేంద్రాలు, స్టేడియాలు, హాస్టళ్లను నిర్బంధ కేంద్రాలుగా ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు.
"ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరిన తర్వాత మా కేంద్రాలన్నింటినీ ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని నిర్ణయించాం. ఈ కేంద్రాలన్నీ ప్రజా ఆస్తులే. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి కావాల్సిన మద్దతును కల్పించటానికి మేము సిద్ధంగా ఉన్నాం."
- రాధే శ్యామ్ జులానియా, శాయ్ సెక్రటరీ
అయితే, ఈ కేంద్రాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటి నుంచి వారి ఆధీనంలోకి తీసుకుంటుందో స్పష్టత రాలేదు. దిల్లీలో 10 శాయ్ కేంద్రాలతో పాటు 5 స్టేడియాలు ఉన్నాయి. వీటి ద్వారా కనీసం 2 వేల మందికి సరిపడే నిర్బంధ సౌకర్యాలు కల్పించవచ్చని అంచనా.
ఇప్పటికే శాయ్ కేంద్రాలన్నింటినీ మూసివేయగా.. ఒలింపిక్స్‌కు శిక్షణ పొందుతున్న కొంతమందికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. వీరికోసం కఠినమైన మార్గదర్శకాలను జారీచేశారు. ఈ క్రీడాకారులు ఎవ్వరికీ బయట వ్యక్తులతో సంబంధం లేకుండా జాగ్రత్త వహిస్తున్నారు.
భారతదేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. 324 మంది వైరస్ బారిన పడి బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3,08,564 మందికి సోకగా.. 13 వేలకు పైగా మరణాలు సంభవించాయి.
ఇదీ చూడండి.. ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుకు ఆడతా: ఛెత్రి