"ఆటలంటా ఆటలు.. ఆడపిల్లవూ ఓ అయ్య చేతిలో పెడితే మా భారం దిగుతుంది" అని ఓ పేద తండ్రి.. "ఆటలు మగపిల్లలకు మాత్రమే.. ఆడపిల్లలకు ఎందుకు" అని ఓ మధ్య తరగతి కుటుంబీకుడు.. "నీకెందుకు ఆటలు శుభ్రంగా చదువుకోగా.." అని పరువుకు ప్రాధాన్యమిచ్చే ఓ ఇంటి పెద్ద.. తరగతి ఏదైనా.. ఒకప్పుడు వీరందరి నోటా ఇదే మాట.. ఆడపిల్లలకు ఆటలెందుకు? ఇప్పుడు పరిస్థితి మారింది మగవాళ్లకు దీటుగా క్రీడల్లో రాణిస్తున్నారు మహిళలు. ఈ ఏడాది పురుషులు ఆధిపత్యం వహించే ఆటల్లోనూ అదరగొట్టారు కొంత మంది అతివలు.
పీవీ సింధు..
2016 రియో ఒలింపిక్స్‌లో రజతం కైవసం చేసుకొని క్రికెటర్ కాకుండా అత్యంత పాపులరైన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది సింధు. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించింది. ఆగస్టు 25న నవోమీ ఒకుహురాపై 21-17, 21-7 తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా.. మహిళల సింగిల్స్‌లో అంతర్జాతీయ ఈవెంట్లలో ఆరు సార్లు తలపడి 5 మెడల్స్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం 13వ ర్యాంకులో ఉన్న సింధు.. ఈ ఏడాది అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ఇటీవల వరుసగా మేజర్ టోర్నీల్లో విఫలమైనప్పటికీ 2020 టోక్యో ఒలింపిక్సే లక్ష్యంగా కృషి చెస్తోంది ఈ తెలుగు తేజం.
మేరీ కోమ్..
బాక్సింగ్ అంటే మగవాళ్లు మాత్రమే ఆడే క్రీడ అని భ్రమపడుతున్న రోజుల్లో.. మహిళల్లో స్ఫూర్తి నింపి ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది మేరీ కోమ్. ఈ ఏడాది జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యాన్ని దక్కించుకుని.. సక్సెస్ఫుల్ బాక్సర్‌గా ఘనత సాధించింది. ముగ్గురు పిల్లలకు తల్లి అయినా.. ఈ ఏడాది గువాహటి వేదికగా జరిగిన ఇండియా కప్, ఇండోనేసియాలో జరిగిన ప్రెసిడెంట్ కప్‌లో స్వర్ణాలు నెగ్గి టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా దూసుకెళ్తోంది.
వినేశ్ ఫొగాట్..
గీత, బబితా తర్వాత ఫొగాట్ కుటుంబం నుంచి వచ్చిన మరో రెజ్లర్ వినేశ్ ఫొగాట్. 25 ఏళ్ల ఈ హరియాణా కుస్తీ క్రీడాకారిణి ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి.. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ ఏడాది వరుసగా మూడు స్వర్ణాలు నెగ్గింది వినేశ్. ఆసియన్, యాసర్ డోగు ఇంటర్నేషనల్, పొలాండ్ ఓపెన్‌ల్లో పసిడి పతకాలు చేజిక్కించుకుంది.
53 కేజీల విభాగంలో తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంకైన రెండో స్థానానికి ఎగబాకింది. ఇటీవలే 50 కేజీల విభాగానికి మారిన వినేశ్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని గెల్చిన భారత ఐదో మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించింది. అంతకుముందు ఆల్కా తోమార్(2006), గీతా ఫొగాట్(2012), బబితా ఫొగాట్(2012), పుజా దందా(2018) ఈ టోర్నీలో పతకాలు సొంతం చేసుకున్నారు.
హిమదాస్..
ఈ ఏడాది జులైలో జరిగిన టోర్నీల్లో 20 రోజుల వ్యవధిలో 5 స్వర్ణాలు గెల్చుకుంది భారత అథ్లెట్ హిమదాస్. ఈ 19 ఏళ్ల స్ప్రింటర్ 200మీటర్ల రేసులోనే 4 మెడల్స్ సాధించింది. 400 మీటర్ల విభాగంలో ఐదో పసిడి కైవసం చేసుకుంది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. అసోంలోని మారుమూల గ్రామంలో రైతు కుటుంబానికి చెందిన హిమ.. వివిధ బ్రాండ్ల ద్వారా ఏడాదికి రూ.30 నుంచి 35లక్షలు ఆర్జిస్తుంది. అంతేకాకుండా ఎక్కువగా ప్రభావితం చేసిన అథ్లెట్‌గా ఫోర్బ్స్ ఇండియా టాప్-30లో చోటు దక్కించుకుంది. యూనిసెఫ్‌లో భారత తొలి యూత్ అంబాసిడర్‌గా నియమితులైంది.
ద్యుతి చంద్..
స్వతహాగా రన్నరైన ద్యుతి చంద్.. సామాజిక ఆర్థిక కారణాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వాటన్నింటిని అధిగమించి యువతకు రోల్‌మోడల్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ వస్తున్న తరుణంలో ఈ ఏడాది అద్భుతంగా రాణించింది ద్యుతి. జులైలో ఇటలీ నేపిల్స్లో జరిగిన యూనివర్సిటీ గేమ్స్‌లో 100మీటర్ల రేసులో స్వర్ణం నెగ్గి.. ఈ టోర్నీలో పసిడి సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం సాధించిన రెండో భారత ప్లేయర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది.
ఆగస్టులో జరిగిన 5వ ఇండియన్ గ్రాండ్‌ప్రిక్స్‌లో మరో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది ద్యుతి. అక్టోబరులో రాంచీలో జరిగిన నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తన రికార్డు తానే బ్రేక్ చేసింది. 100 మీటర్ల సెమీస్ రేసులో 11.22 సెకండ్లలో గమ్యాన్ని చేరింది.
ఇదీ చదవండి: శ్రీకాంత్, అంజుమ్‌కు సీకే నాయుడు పురస్కారాలు