Prathamesh Jawkar in Archery World Cup 2023 : ప్రపంచ నంబర్‌వన్ ఓ వైపు.. రెండో ప్రపంచకప్ టోర్నీలో ఆడుతున్న 19 ఏళ్ల యువకుడు మరోవైపు. అందరి ఫేవరెట్ నం.1 ఆటగాడే! కానీ అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ ఆర్చర్ ప్రథమేశ్ జవకర్ మేటి ఆర్చర్‌కు షాకిస్తూ పసిడి పతాకాన్ని కొల్లగొట్టి దేశానికి పేరు తెచ్చాడు. ఆర్చరీ ప్రపంచకప్‌లోనే తొలిసారి స్వర్ణాన్ని ముద్దాడిన వ్యక్తిగా నిలిచాడు. ఇక తమ అద్భుత ఫామ్‌తో భారత జంట జ్యోతి సురేఖ, ఒజస్ డియోటలే వరుసగా రెండో ప్రపంచకప్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్టును మట్టికరిపించిన ఈ జంట.. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. దీంతో కాంపౌండ్ విభాగంలో రెండు స్వర్ణాలతో భారత్.. ఈ టోర్నీని ముగించింది.
Jyothi Vennam wins gold : ఆంటల్యాలో ప్రపంచకప్ స్టేజ్-1లో సురేఖ జోడీ స్వర్ణం సాధించినప్పటికీ.. ఈసారి ఫైనల్ ప్రత్యర్థి టాప్‌సీడ్ కొరియాకు చెందిన కిమ్ జాంగో, ఒ యూహున్ కావడం వల్ల వారిపై పసిడి అంచనాలు తక్కువగానే ఉన్నాయి. అయితే నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఫైనల్స్‌లో జ్యోతి-ఒజస్ 156-155 స్కోర్‌తో కొరియా జోడీకి షాకిచ్చింది. అలా జ్యోతి ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శనను కనబరిచింది. ఒజస్ కంటే ఎక్కువసార్లు పది పాయింట్ల మార్క్‌ను అందుకుంది. అంతే కాకుండా ఈ ఏడాది ప్రపంచకప్‌లో సురేఖ సాధించిన మూడో స్వర్ణం ఇది. ఆంటల్యాలో ప్రపంచకప్ స్టేజ్-1లో వ్యక్తిగత విభాగం, మిక్స్‌డ్ డబుల్స్‌లో పసిడి గెలిచిన ఆమె.. ఇప్పుడు మిక్స్‌డ్ డబుల్స్‌లో నెగ్గింది.
ఇక రెండు దేశాల ఆర్చర్లు పోటాపోటీగా పది పాయింట్లు స్కోరును సాధించడం వల్ల తొలి మూడు సెట్లలో 40కి 39 చొప్పున వచ్చాయి. ఒకానొక సమయంలో స్కోరు 117-117తో మ్యాచ్ సమమైంది. అయితే ఆఖరి సెట్లోని ఆఖరి బాణంతో జ్యోతి పది పాయింట్లు స్కోర్ చేయగా.. ఒత్తిడిలో ప్రత్యర్థి ఆర్చర్ 9కే పరిమితమవ్వడం వల్ల స్వర్ణం భారత్ సొంతమైంది.
మరోవైపు ఈ టోర్నీలో అందరినీ విశేషంగా ఆకర్షించింది మాత్రం ప్రథమేశ్ ఘనతే. అతడు పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో 149-148 స్కోర్‌తో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత మైక్ స్కోసర్ (నెదర్లాండ్స్)ను చిత్తుగా ఓడించాడు. పదిహేను బాణాల్లో ఒక్కసారి మాత్రమే అతడు 9 పాయింట్లు స్కోర్ చేశాడు. మిగతా బాణాలన్నీ పదిని తాకాయి. నాలుగు సెట్లు ముగిసేసరికి స్కోరు 119-119తో సమమైంది. ఆఖరి సెట్లో ప్రథమేశ్ మూడు ప్రయత్నాల్లో పది స్కోరు సాధించగా.. మైక్ ఒకసారి మాత్రమే గురి తప్పాడు.