Novac Djokovic dubai duty free tennis championship: వీసా రద్దుతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు జకోవిచ్ తిరిగి కోర్టులో అడుగుపెట్టేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. సోమవారం ఆరంభమయ్యే డ్యూటీ ఫ్రీ పురుషుల టెన్నిస్ ఛాంపియన్‌షిప్ ప్రధాన డ్రా పోటీల్లో అతను పాల్గొంటున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీ మహిళల మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అవసరమైతే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ తదితర టోర్నీలకు దూరంగా ఉంటాను కానీ కొవిడ్ టీకా తీసుకోనని ఇటీవల జకో ప్రకటించాడు. టీకా తీసుకోని వాళ్లకు అనుమతి లేదన్న కారణంతోనే అతని వీసాను రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. స్వదేశం పంపించిన విషయం విదితమే. ఆ సంఘటన తర్వాత తొలి టోర్నీ కోసం అతను యూఏఈ చేరుకున్నాడు.
"వచ్చే సోమవారం తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టడం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఎంతో ఉత్తేజితంగా ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఘటన తర్వాత నిజంగా చెప్పాలంటే టెన్నిస్‌కు దూరమయ్యా అనిపించింది. కానీ ప్రస్తుతం కరోనా టీకా వేయించుకోవాలనే ఉద్దేశంతో లేను. అందువల్ల కలిగే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. నేనేమీ ప్రత్యేకం కాదు. జీవితంలో ఏమైనా జరగొచ్చు" అని జకోవిచ్ తెలిపాడు.
దుబాయ్‌కు రావాలంటే కచ్చితంగా టీకా వేసుకోవాలనే నిబంధనలేమీ లేవు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న జకో.. ముందుగా ఎక్స్‌పో 2020 కార్యక్రమంలో పాల్గొన్నాడు. సెర్బియాలో చిన్నారుల విద్య కోసం నొవాక్ జకోవిచ్ ఫౌండేషన్ అందిస్తున్న సేవల గురించి అతని భార్య జెలీనా ఆ కార్యక్రమంలో వివరించింది. ఆ వేదిక మీద ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని అనంతరం జకోవిచ్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: 'గ్రాండ్ స్లామ్ నుంచి తప్పుకుంటా కానీ.. అలా చేయను'