భారత మాజీ స్ప్రింటర్ మిల్కా సింగ్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు.. చంఢీగడ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(PGIMER) వైద్య బృందం వెల్లడించింది. కొవిడ్ ప్రభావంతో ఇటీవల ముందస్తు జాగ్రత్తతో మరోసారి ఐసీయూలో చేరారు మిల్కా.
రెండు వారాల క్రితం కొవిడ్ బారిన పడిన మిల్కా సింగ్‌ను తొలుత చంఢీగడ్‌లోని తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం కోసం మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చేర్పించారు. వారం క్రితం ఆ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మళ్లీ పరిస్థితి కాస్త అదుపు తప్పడం వల్ల తిరిగి పీజీఐఎంఈఆర్లోని ఐసీయూలో చేర్పించారు.
"కొవిడ్ కారణంగా మిల్కా సింగ్ ఇక్కడ చేరారు. అన్ని వైద్య పరీక్షల తర్వాత ఈ రోజు ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆయన ఆరోగ్యాన్ని ముగ్గురు వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు" అని ప్రొఫెసర్ అశోక్ కుమార్ తెలిపారు.
అంతకుముందు మిల్కా సింగ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: ఐసీయూలో దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్