కెన్యా అథ్లెట్ ఎల్యూడ్ కిప్‌చోగి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రియా రాజధాని వియాన్నలో జరిగిన ఓ మారథాన్‌ను రెండు గంటల్లోనే పూర్తి చేసి ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్నాడు.
ఓ మారథాన్‌ను రెండు గంటల వ్యవధిలో పూర్తి చేయవచ్చా లేదా అనే ప్రశ్నకు సమాధానం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వియన్నాలోని అతిపెద్ద పార్కు ఇందుకు వేదికైంది. దాదాపు 43 కిలోమీటర్లు సాగిన ఈ రేస్‌ను పూర్తి చేయడానికి కిప్‌చోగి తీసుకున్న సమయం 1 గంట 59 నిమిషాల 40.2 సెకన్లు. దీని ద్వారా... ఓ మారథాన్‌ను రెండు గంటల్లోపే పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా ఘనత సాధించాడు కిప్‌చోగి.
నిజానికి 2017లోనే ఈ తరహా పోటీలో పాల్గొన్నాడు కిప్‌చోగి. ఇటలీలో జరిగిన ఆ మారథాన్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. కానీ పరుగును పూర్తి చేయడానికి 2 గంటల 9 సెకన్లు పట్టింది. అప్పటి నుంచి నిరంతరం శ్రమించి, కఠోర సాధన చేసి.. రెండు గంటల్లోపే మారథాన్‌ను పూర్తి చేయాలన్న తన గమ్యాన్ని చేరాడు కిప్‌చోగి.
"నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. సమయం తీసుకుని నా పరుగును చూసిన వారందరికి ధన్యవాదాలు. కలను నేరవేర్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. 2017లో ప్రయత్నించి విఫలమైనా.. ఇప్పుడు సాధించగలిగాను. ఇది కేవలం గెలుపు గురించే కాదు. అనుకున్న దాని మీద మనసు పెడితే ఏదైనా చేయవచ్చు."
-- ఎల్యూడ్ కిప్‌చోగి, అథ్లెట్.
అయితే ఈ మారథాన్ కోసం ఉపయోగించిన ట్రాక్.. ఇతర అంశాల వల్ల కిప్‌చోగి తీసుకున్న సమయాన్ని ప్రపంచ రికార్డుగా గుర్తించలేమని అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- సచిన్ కంటే కోహ్లీ బ్యాట్‌కే వేగమెక్కువ..!