జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ రికార్డును తలదన్నేలా కంబళ పోటీల్లో పరుగులు తీసి సంచలనం సృష్టించిన శ్రీనివాస గౌడకు శాయ్ నిర్వహిస్తున్న ట్రయల్ తేదీ ఇంకా ఖరారు కాలేదు. అతని వేగాన్ని అంచనా వేసేందుకు తమ టాప్ కోచ్‌లతో బెంగళూరులో సోమవారం నిర్వహించే ట్రయల్‌కు హాజరు కావాలని శాయ్ మొదట గౌడను ఆహ్వానించింది. కానీ అతనికి విశ్రాంతి ఇచ్చి, ఇక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించడం కోసం ఈ ట్రయల్ తేదీ ఖరారు చేయలేదు.
"శ్రీనివాస గౌడ సోమవారం శాయ్ సెంటర్‌కు చేరుకుంటాడు. కానీ అతనికి ఒకటి రెండు రోజులు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం. అయితే అతనికి ఎప్పుడు ట్రయల్ నిర్వహిస్తామనేది ఇంకా ఖరారు కాలేదు'
-శాయ్ వర్గాలు.
28 ఏళ్ల ఈ కన్నడ జాకీ.. కంబళ రేసును 13.62 సెకన్లలో పూర్తి చేశాడు. అందులో అతను 100 మీటర్ల పరుగును 9.55 సెకన్లలోనే అందుకోవడం పెను సంచలనం సృష్టించింది. ఈ టైమింగ్ 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు సృష్టికర్త ఉసేన్ బోల్ట్ (9.58 సె) కన్నా మెరుగ్గా ఉండడమే ఇందుకు కారణం. కంబళ రేసులో గౌడ పరుగులు తీస్తున్న వీడియో వైరల్ కావడం వల్ల క్రీడా మంత్రి కిరణ్ రిజిజు.. అతనికి ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా శాయ్ కోచ్‌లను ఆదేశించారు.
ఇదీ చదవండి: నితిన్.. నిఖిల్ల పెళ్లి ఒకే రోజు..!