కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా టోర్నీలు రద్దు కావడం లేదా వాయిదా పడడం జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జులై 24న టోక్యో ఒలింపిక్స్ ఆరంభమవుతాయా? లేదా? అనే అనుమానాలు వస్తూనే ఉన్నాయి. అయితే ముందుగా నిర్ణయించిన దాని ప్రకారమే ఒలింపిక్స్ జరిగి తీరుతాయని జపాన్ ప్రధాని షింజో అబె శనివారం స్పష్టం చేశారు.
"అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), ఒలింపిక్ నిర్వాహక కమిటీ ప్రతినిధులతో సంప్రదించిన తర్వాతే మేం స్పందిస్తాం. ఒలింపిక్స్ నిర్వహణ తేదీల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. వైరస్ వ్యాప్తిని అధిగమించి మరీ షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్‌ను జరిపి తీరుతాం. ఈ మెగా క్రీడలను విజయవంతం చేయడానికి అమెరికా తోడ్పాటు అందిస్తుందని ఆశిస్తున్నా" -షింజో అబె, జపాన్ ప్రధాని
ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వాహకులను కోరిన సంగతి తెలిసిందే.