విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా కట్టడికి జపాన్లో గురువారం అత్యయిక స్థితిని విధించారు ప్రధాని యొషిహిదె సుగా. అయితే జులైలో నిర్వహించ తలపెట్టిన ఒలింపిక్స్ క్రీడలను ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు.
"దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్.. ప్రజల జీవితాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర పరిణామాలు చూపవచ్చు. దానిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే యాంటివైరస్ చట్టం ప్రకారం అత్యయిక స్థితి విధిస్తున్నా" అని ప్రకటించారు ప్రధాని సుగా.
జపాన్లో కేవలం గురువారం నాడే తొలిసారిగా 7వేల పైచిలుకు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరి కల్లా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తామని సుగా తెలిపారు.
ఒలింపిక్స్ కష్టమే!
జపాన్లో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఒలింపిక్స్ నిర్వహించడం కష్టమే అని అన్నారు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడు రిచర్డ్ పౌండ్. టోక్యోలో మహమ్మారి పెరుగుతున్నందున మరో ఆరు నెలల్లో జరగాల్సిన మెగాటోర్నీ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జపాన్ ప్రధాని సుగా ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు పౌండ్.
కరోనా మహమ్మారి విజృంభణతో గతేడాది జరగాల్సిన విశ్వక్రీడలు వాయిదాపడ్డాయి. టోక్యోలో 2021 జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్, ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు పారా ఒలింపిక్స్ జరగనున్నాయి.
ఇదీ చూడండి: మరోసారి లాక్డౌన్ విధించిన చైనా