ETV Bharat / sports

Tokyo Olympics: బాక్సింగ్​లో పడుతుందా పతక పంచ్​! - టోక్యో ఒలింపిక్స్​

అంతర్జాతీయ స్థాయిలో చాలా ఏళ్ల నుంచి భారత బాక్సర్లు నిలకడగా సత్తాచాటుతూనే ఉన్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ మొదలు ఆసియా ఛాంపియన్‌షిప్స్‌.. ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల్లో మన బాక్సర్లు ఛాంపియన్లుగా నిలిచి దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందిస్తున్నారు. కానీ ఒలింపిక్స్‌కు వచ్చేసరికి మన రికార్డేమీ గొప్పగా లేదు. ఈ విశ్వ క్రీడల బాక్సింగ్‌ చరిత్రలో భారత్‌ ఇప్పటివరకూ రెండు పతకాలు మాత్రమే గెలిచింది. అవి కూడా కాంస్యాలే. ఈసారి ఒకటికి మించి పతకాలు సాధిస్తారని, అందులో ఒక పసిడి కూడా ఉంటుందన్న అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను ఏమేర అందుకుంటారో!

indian boxers in tokyo olympics
ఇండియన్ బాక్సర్స్​
author img

By

Published : Jul 15, 2021, 6:54 AM IST

భారత ఒలింపిక్స్‌ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 23న ఆరంభమయ్యే టోక్యో క్రీడల్లో మొత్తం తొమ్మిది మంది బాక్సర్లు బరిలో దిగనున్నారు. అర్హత టోర్నీల్లో సత్తాచాటిన మన బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో టోక్యో బెర్తు దక్కించుకున్నారు. అయిదుగురు పురుష, నలుగురు మహిళా బాక్సర్లు ఒలింపిక్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ఉన్నారు. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ (51 కేజీలు)తో పాటు సిమ్రన్‌జీత్‌ కౌర్‌ (60 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), లవ్లీనా (69 కేజీలు) మహిళల విభాగంలో పోటీపడుతుండగా.. వికాస్‌ యాదవ్‌ (69 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (91 కేజీలు), అమిత్‌ పంగాల్‌ (52 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు) పురుషుల కేటగిరీలో తలపడనున్నారు. గత రియో ఒలింపిక్స్‌లో కేవలం పురుషుల్లో మాత్రమే ముగ్గురు బాక్సర్లు రింగ్‌లో దిగగా.. ఒక్కరూ పతకం సాధించలేకపోయారు. ఇప్పుడా రికార్డును మెరుగుపర్చాలనే ధ్యేయంతో ఈ బాక్సర్లున్నారు. గతేడాది చివర్లో ప్రపంచకప్‌ బాక్సింగ్‌లో, ఈ ఏడాది మేలో జరిగిన ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఈ బాక్సర్లు ఒలింపిక్స్‌కు ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో మేరీకోమ్‌, పురుషుల్లో అమిత్‌పై అందరి కళ్లూ ఉన్నాయి. ప్రస్తుతం ఇటలీలో సాధన చేస్తున్న భారత బాక్సర్లు ఈ నెల 17న నేరుగా అక్కడి నుంచే టోక్యో వెళ్లనున్నారు.

ఎలా ముగిస్తుందో!

indian boxers in tokyo olympics
మేరీకోమ్​

మరే బాక్సర్‌కు సాధ్యం కాని రీతిలో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్లు కాబట్టి 2024 ఒలింపిక్స్‌లో తను ప్రాతినిథ్యం వహించడం కష్టమే. దీంతో టోక్యోలోనే పసిడి గెలిచి ఒలింపిక్స్‌ను ఘనంగా ముగించాలని ఆమె భావిస్తోంది. మహిళల బాక్సింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టిన 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన ఆమె.. ఈ సారి దాన్ని బంగారు పతకంగా మారుస్తుందనే అంచనాలున్నాయి. గత ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో మేరీ విఫలమైంది. కానీ వయసు మీద పడుతున్నా పవర్‌ తగ్గని పంచ్‌తో ప్రత్యర్థులను మట్టికరిపించే ఈ అమ్మ అదే జోరు కొనసాగిస్తే టోక్యోలో పతకం దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం 51 కేజీల విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న ఈ మణిపూర్‌ బాక్సర్‌ ఒలింపిక్స్‌ ఆరంభోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించనుంది. ఆమె మరోసారి పోడియంపై నిలబడితే చూడాలని దేశమంతా కోరుకుంటోంది. మరోవైపు ఆసియా ఛాంపియన్‌ పూజా రాణి కూడా పతకానికి బలమైన పోటీదారే. చిన్నతనంలోనే పంచ్‌లు విసరడంపై ప్రేమ పెంచుకుని.. తల్లిదండ్రులకు తెలీకుండా శిక్షణ పొంది ఛాంపియన్‌గా ఎదిగిన ఈ 30 ఏళ్ల హరియాణా బాక్సర్‌ మిడిల్‌వెయిట్‌ విభాగంలో పతకం గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కాంస్య విజేతలు సిమ్రన్‌జీత్‌ సింగ్‌, లవ్లీనా కూడా పతకంపై ఆశలు రేపుతున్నారు. రింగ్‌లో పాదరసంలా కదిలి.. ప్రత్యర్థులపై పిడిగుద్దులతో విరుచుకుపడే ఈ యువ బాక్సర్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

నం.1గా..

indian boxers in tokyo olympics
అమిత్​

తన తొలి ఒలింపిక్స్‌లోనే ప్రపంచ నంబర్‌వన్‌గా బరిలో దిగబోతున్న అమిత్‌ దూకుడు మీదున్నాడు. రింగ్‌లో చిరుత వేగంతో ప్రత్యర్థికి దొరక్కుండా తప్పించుకుంటూ.. బలమైన పంచ్‌లతో విజయాన్ని ఖాతాలో వేసుకోవడం అలవాటు చేసుకున్న ఈ 25 ఏళ్ల హరియాణా బాక్సర్‌ టోక్యో నుంచి పతకంతో తిరిగి వస్తాడని ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఒలింపిక్స్‌లో పతకం కోసం ప్రాణం పెట్టి పోరాడేందుకు ఈ 52 కేజీల విభాగంలో నంబర్‌వన్‌ బాక్సర్‌ సిద్ధమయ్యాడు. 2019 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన అమిత్‌.. 13 ఏళ్ల తర్వాత దేశానికి పురుషుల బాక్సింగ్‌లో తొలి పతకాన్ని అందించే దిశగా సాగుతున్నాడు. మరోవైపు అంతర్జాతీయ బాక్సింగ్‌లో దశాబ్ద కాలం పైగా అనుభవం ఉన్న సీనియర్‌ బాక్సర్‌ వికాస్‌ వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో ఆడబోతున్నాడు. స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తర్వాత ఆ ఘనత అందుకున్న తొలి భారత పురుష బాక్సర్‌గా అతను నిలుస్తాడు. 2012లో తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడ్డ అతను.. గత ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌ వరకూ చేరుకోగలిగాడు. ఈ సారి అంతకంటే మెరుగైన ప్రదర్శనతో పతకం కొట్టేయాలనే ధ్యేయంతో ఉన్నాడు. మిగతా బాక్సర్లు మనీశ్‌ కౌశిక్‌, సతీశ్‌ కుమార్‌, ఆశిష్‌ కుమార్‌ కూడా పతకం సాధించే సత్తా ఉన్నవాళ్లే. మరి మన బాక్సర్ల పంచ్‌లు పసిడిని ముద్దాడుతాయో? లేదో, ఎన్ని పతకాలు ఖాతాలో చేరతాయో తేలాలంటే ఒలింపిక్స్‌ వరకూ ఎదురుచూడాల్సిందే.

  • 1948లో తొలిసారి ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో పోటీపడ్డ భారత్‌.. ఇప్పటివరకూ కేవలం రెండు కాంస్య పతకాలు మాత్రమే సాధించగలిగింది. పురుషుల్లో విజేందర్‌ సింగ్‌ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో, మహిళల్లో మేరీకోమ్‌ 2012 లండన్‌ క్రీడల్లో ఒక్కో పతకం గెలిచారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.