ఆరునెలల్లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు అంతా సిద్ధమవుతున్న వేళ... భారత ఆర్చరీ బృందానికి గొప్ప ఊరట లభించింది. భారత ఆర్చరీ సంఘం(ఏఏఐ)పై ఉన్న సస్పెన్షన్‌ను ప్రపంచ ఆర్చరీ ఎత్తివేసినట్లు గురువారం ప్రకటించింది.
ఇదీ జరిగింది...!
రెండు సమాంతర ఆర్చరీ సంఘాలను ఎన్నుకున్నందుకు గత ఏడాది ఆగస్టు 9న భారత బోర్డుపై ప్రపంచ ఆర్చరీ వేటు వేసింది. తాజాగా ఆ సస్పెన్షన్ ఎత్తివేత సందర్భంగా ప్రపంచ ఆర్చరీ పలు షరతులు విధించింది.
>> ఆర్చరీ క్రీడాకారుల సభ్యత్వానికి సంబంధించి సంఘం రాజ్యాంగంలో మార్పులు చేయాలి.
>> ప్రభుత్వంతో ముడిపడిన అంశాల పరిష్కారం, వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించుకోవాలి.
>> మూడు నెలలకు ఒకసారి ప్రగతి నివేదిక సమర్పించాలి.
నిషేధం ఎత్తివేతతో ఆటగాళ్లు.. అంతర్జాతీయ పోటీలకు వ్యక్తిగతంగా కాకుండా భారత పతాకంతో పాల్గొనే అవకాశం లభించనుంది. సస్పెన్షన్ కారణంగా భారత ఆర్చరీ జట్టు ఇప్పటివరకు జరిగిన పలు మెగా ఈవెంట్లలో వ్యక్తిగతంగా పాల్గొనగా, అది ఒలింపిక్ అర్హతపై ప్రభావం చూపించింది.