Hockey World Cup 2023 : హాకీ పురుషుల ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఆట డ్రాగా ముగిసింది. నిర్ణీత 60 నిమిషాల ఆటలో ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. రెండో ఆటలో విజయం సాధించి పూల్ డీలో టాపర్‌గా నిలవాలనుకున్న భారత్‌కు ఇంగ్లాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. మ్యాచ్‌లో గోల్ కొట్టే అవకాశాలను ఇరుజట్ల ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి క్వార్టర్‌లో భారత ఆటగాడు హార్ధిక్ సింగ్ గోల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టుకు అనేకమార్లు గోల్ వేసే అవకాశం లభించినప్పటికీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. రెండో అర్థభాగంలో భారత్ పెనాల్టీ గోల్ వేసే అవకాశాలను తృటిలో చేజార్చుకుంది.
మూడో క్వార్టర్‌లో గోల్ చేసేందుకు భారత్ దూకుడుగా ఆడినప్పటికీ ఇంగ్లాండ్ గోల్ కీపర్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. చివరి నిమిషంలో ఇంగ్లాండ్‌కు పెనాల్టీ గోల్ లభించినప్పటికీ.. దాన్ని పాయింట్‌గా మార్చుకోలేకపోయింది. దీంతో ఆట ముగిసేవరకు ఇరుజట్ల ఖాతాలో ఒక్క గోల్ కూడా నమోదుకాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండు జట్లకు చెరో నాలుగు పాయింట్లు లభించాయి. ఇంగ్లండ్ గోల్ కీపర్ ఒలివర్ పైన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రస్తుతం పూల్ డీలో ఇంగ్లాండ్ తొలి స్థానంలో, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. పూల్ డీలో అంతకుముందు జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ 5- 1 గోల్స్ తేడాతో వేల్స్ పై విజయం సాధించింది.