ఈ నెలలో ఇప్పటికే 4 స్వర్ణాలు సాధించిన భారత స్ప్రింటర్ హిమదాస్ మరో పసిడిని తన ఖాతాలో వేసుకుంది. చెక్ రిపబ్లిక్లో జరిగిన అథ్లెట్ మీట్లో 400 మీటర్ల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. 52.09 సెకన్లలో పరుగు పూర్తి చేసి ఈ సీజన్ అత్యుత్తమ రికార్డు నెలకొల్పింది.
అయితే స్వర్ణాన్ని నెగ్గినా.. సెప్టెంబరులో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించ లేకపోయింది. క్వాలిఫై కావాలంటే 51.88 సెకన్లలో పరుగు పూర్తి చేయాలి. కానీ 52.09 సెకన్లతో తృటిలో అవకాశాన్ని కోల్పోయింది. గత ఏప్రిల్‌లో వెన్నునొప్పితో 400 మీటర్ల రేసుకు దూరమైన హిమ పునరాగమంలో సత్తాచాటింది.
- జులై 2న పొలాండ్‌లో జరిగిన పొజ్నాన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో (23.65) 200మీ విభాగంలో తొలి స్వర్ణాన్ని కైవసం చేసుకుందీ అసోం స్ప్రింటర్.
- జులై 7న కుట్నో అథ్లెట్ మీట్లో 200 మీటర్ల (23.97) విభాగంలో మరో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.
- జులై 13న క్లాద్నో అథ్లెట్ మీట్లో 200మీటర్ల విభాగంలోనే మూడో స్వర్ణం చేజిక్కించుకుంది. 23.43 సెకన్లలో రేసు పూర్తి చేసింది.
- బుధవారం చెక్ రిపబ్లిక్లో జరిగిన టాబోర్ అథ్లెట్ మీట్లో నాలుగో పసిడిని కైవసం చేసుకుంది.
400మీ హర్డిల్స్ విభాగంలో జబీర్ కూడా బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 200 మీటర్ల రేసులో మొహమ్మద్ అనాస్ 20.95 సెకన్లలో పరుగుపూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు.
ఇది చదవండి: ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం రెజ్లర్ల ఎంపిక