ఖతర్ దోహా వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2019 ఆదివారంతో ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పతకం గెలవకుండానే భారత క్రీడాకారులు ఇంటిముఖం పట్టారు. ఒక్క మెడల్ మినహా మరో పతకాన్ని గెలవలేదు భారత్. ఈ సారైనా పతక ఆశలతో బరిలోదిగిన మన అథ్లెట్లు ప్రభావం చూపలేకపోయారు. అయితే మూడు ఈవెంట్లలో ఫైనల్వరకు వెళ్లి.. వచ్చే టోర్నీల్లో పతకంపై ఆశలు చిగురింపజేశారు.
ఆదివారం జరిగిన మారథాన్ పోటీతో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ ప్రయాణం ముగిసింది. ఈ పోటీలో గోపి తోనాకల్ 2 గంటల 15నిమిషాల 57 సెకండ్లలో పూర్తిచేసి 21వ స్థానంలో నిలిచాడు. 2గంటల 11 నిమిషాలలోపు రేసు పూర్తిచేసినట్లయితే.. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేవాడే. నాలుగు నిమిషాల వ్యవధిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు గోపి.
భారత్ చివరగా 2003లో ప్యారిస్‌లో జరిగిన పోటీల్లో కాంస్యం దక్కించుకుంది. లాంగ్ జంపింగ్‌లో అన్జుబాబీ అప్పుడు 3వ స్థానంలో నిలిచి పతకం కైవసం చేసుకుంది.
ఈ సారి మెడల్ గెలవనప్పటికీ ఆకట్టుకునే ప్రదర్శనతో ముగ్గురు అథ్లెట్లు ఫైనల్ వరకు వెళ్లారు. 4X400 మిక్స్డ్ రిలే జట్టు, 3000 మీటర్ల స్టిపుల్ఛేజ్, మహిళల జావెలిన్‌త్రో విభాగాల్లో తుదిపోరుకు అర్హత సాధించారు. చివరి వరకు పోరాడినప్పటికీ మెడల్ దక్కించుకులేకపోయారు.
మహిళల జావెలిన్‌త్రోలో అన్ను రాణి జాతీయ రికార్డు బద్దలు కొట్టి ఫైనల్‌కు చేరింది. తుదిపోరులో 8వ స్థానంలో నిలిచింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా జావెలిన్ త్రోయర్‌గా రికార్డు సృష్టించింది అన్ను రాణి.
స్టీపుల్ ఛేజర్ అవినాశ్ సాబెల్, 4X400 మిక్స్డ్ రిలే టీమ్ ఫైనల్ వరకు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 2015లో జరిగిన బీజింగ్ టోర్నీలోనూ ముగ్గురు అథ్లెట్లు ఫైనల్‌కు వరకు వెళ్లారు. 2017 లండన్ పోటీల్లో మరీ ఒకే ఒక్కరు చివరి వరకు వెళ్లగలిగారు.
4X400 మిక్స్డ్ రిలేలో ఫైనల్ చేరిన భారత జట్టు.. పురుషులు, మహిళల విభాగాల్లో సత్తాచాటలేకపోయింది. కనీసం ఒలింపిక్స్‌కూ అర్హత సాధించలేక నిరాశ పరిచారు. పురుషుల జావెలిన్ త్రోలో శివపాల్ సింగ్ గ్రూప్-ఏ తొలిరౌండ్లోనే వెనుదిరిగాడు. 78.97 మీటర్లు విసిరి 10వ స్థానంలో నిలిచిన శివ ప్రపంచ ఛాంపియన్షిప్స్ నుంచి నిష్క్రమించాడు.
ఇదీ చదవండి: షమీ ఖాతాలో పాంచ్ వికెట్ల పటాకా