Erriyon Knighton Record : ఫ్లోరిడాకు చెందిన ఎరియన్ నైటాన్.. చూసేందుకు బాస్కెట్ బ్యాట్ ప్లేయర్లా ఉంటాడు. బోల్ట్లానే పొడుగ్గా.. సన్నగా ఉండే ఈ స్టార్ ప్లేయర్.. ట్రాక్‌లో పరుగు తీస్తుంటే ఇక మిగిలిన వాళ్లు అతడి వెనుక ఉండాల్సిందే. అయితే వాస్తవానికి నైటాన్ చిన్నప్పటి నుంచి రన్నర్ కాదు. అతను ఓ ఫుట్‌బాల్ ప్లేయర్. ఇదే ఆటలో కొంత కాలం కొనసాగిన నైటాన్.. తనలో ఉన్న మెరుపు వేగాన్ని ఆలస్యంగానే గుర్తించాడు. అయినప్పటికీ ప్రస్తుత స్ప్రింట్ స్టార్లు నోవా లేల్స్ లాంటి వాళ్లకు తన వేగంతో చెమటలు పట్టిస్తున్నాడు.
ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన కోచ్ మైక్ హోలోవె వద్ద శిక్షణ పొందిన ఈ కుర్రాడు.. 200 మీటర్ల పరుగులో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. 2020లో జూనియర్ ఒలింపిక్ క్రీడల్లో 200 మీటర్ల పరుగును 20.33 సెకన్లలో పూర్తి చేసి 15-16 వయసు విభాగంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక జూనియర్ స్థాయిలోనే మంచి ఫామ్‌కు వచ్చిన ఈ కుర్రాడు.. గతేడాది యూజీన్ వేదికగా జరిగిన ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ క్రీడల్లో మరో సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలో 200 మీటర్ల పరుగును 19.49 సెకన్లలో పూర్తి చేసి ఉసేన్ బోల్ట్ పేరిట 18 ఏళ్లుగా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అలా 200 మీటర్ల పరుగును 20 సెకన్లలోపు పరుగెత్తిన తొలి అమెరికా అథ్లెట్‌గానూ కూడా నైటన్ ఘనత సాధించాడు.
ఇక గత రెండేళ్లుగా డైమండ్ లీగ్‌లో 200 పరుగులో అతడికి ఎదురే లేదు. ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్‌లోనూ నైటాన్‌దే పైచేయిగా సాగుతోంది. దీంతో ఈ వరుస విజయాలతోనే అతడు రెండుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ 'రైజింగ్ స్టార్' అవార్డును కైవసం చేసుకున్నాడు.
100 మీటర్ల పరుగులోనూ సత్తా చాటినప్పటికీ.. అతడి ప్రధాన దృష్టి మాత్రం 200 మీ. మీదే కేంద్రీకరించాడు. ఈ క్రమంలో అండర్-20 కేటగిరిలో 200 మీటర్ల పరుగులో పదకొండుసార్లు తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. అందుకే ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగులో ఈ కుర్రాడు ఫేవరెట్‌గా బరిలో దిగుతున్నాడు.
మరోవైపు గతేడాది 19.31 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని.. మైకేల్ జాన్సన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన నోవా లేల్స్‌కు ఈసారి నైటాన్‌తో పోటీపడి గెలవడం కష్టంగా అనిపిస్తోంది. అయితే ట్రాక్ మీదే కాదు రోడ్డు మీదా దూసుకెళ్లడం నైటాన్‌కు సరదా. స్పోర్ట్స్ కారుల్లో షికారు కొడుతూ ట్రాక్ సెంటర్లకు వెళుతుంటాడు ఈ అమెరికన్ టీనేజర్. ఏదో ఒకరోజు మెక్‌లారెన్, లాంబోర్గిని లాంటి కార్లు కొనాలనేది ఇతడి ఆశ. అంతేకాదు ఒకటి కాదు రెండు ఒలింపిక్స్ స్వర్ణాలు నెగ్గాలనేది కూడా నైటాన్ లక్ష్యం. కాగా ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గి 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనే ధ్యేయంతో ఉన్నాడు.
World Athletics awards: స్ప్రింటర్ అంజూ బాబీకి ప్రతిష్ఠాత్మక అవార్డు