హిమాలయ రాజ్యం నేపాల్ ఆతిథ్యమిస్తున్న పదమూడో దక్షిణాసియా క్రీడల్లో భారత బృందం ప్రదర్శన, దండిగా పతకాలు ఒడిసిపడుతున్న తీరు- కళ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ‘దక్షిణాసియా ఒలింపిక్స్’గా ప్రతీతమైన ఈ ‘శాగ్’ క్రీడోత్సవాన పాల్గొన్న ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేసిన భారత జట్టు పతకాల పట్టికలో ఈసారీ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. స్వర్ణాల పద్దులో నేపాల్, మొత్తం పతకాల ప్రాతిపదికన శ్రీలంక రెండో స్థానాన నిలిచినా- వాటికి, భారత్‌కు మధ్య యోజనాల అంతరం ప్రస్ఫుటమవుతోంది. తమవంతుగా మూడు శ్రేణుల్లో కలిపి వంద పతకాల స్కోరును అధిగమించిన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల సరసన మాల్దీవులు, భూటాన్ వెలాతెలాపోతున్నాయి. ఈసారి 319 కాంచనాలు సహా 1,119 పతకాలకు 2,700 మంది అథ్లెట్లు పోటీపడిన క్రీడా సంరంభానికి నేటితో తెరపడనుంది.
ఈ క్రీడల్లో తొలిరోజు నుంచే స్పష్టమైన ఆధిక్యం కనబరచే ఆనవాయితీని భారత్ ఈసారీ నిలబెట్టుకుంది. సుమారు మూడున్నరేళ్లక్రితం పన్నెండో దక్షిణాసియా క్రీడల్లో షూటింగ్, బాక్సింగ్, జూడో, తైక్వాండో, కబడ్డీ తదితర విభాగాలన్నింటా ఇండియాకు ఎదురన్నదే లేకపోయింది. ప్రస్తుత క్రీడాస్పర్ధలో ఈత, కుస్తీ, బరువులెత్తడం, ఉషు వంటి అంశాల్లోనూ భారత అథ్లెట్ల జోరు పతకాల పంట పండించింది. బాక్సింగ్ బరిలోనూ మనవాళ్లు కదను తొక్కారు. ధనుర్విద్యలో బంగ్లాదేశ్, జావెలిన్ త్రోలో పాకిస్థాన్, నడక-పరుగు పందాల్లో శ్రీలంక క్రీడాకారులు తళుక్కున మెరిసినా సింహభాగం పోటీల్లో భారత్‌కే వాతావరణం అనుకూలించింది. వెరసి, అచ్చొచ్చిన దక్షిణాసియా క్రీడోత్సవాన ఇండియా చుక్కల్లో జాబిలిలా ప్రకాశిస్తోంది!
30ఏళ్ల ప్రస్థానం..
ముప్ఫై అయిదేళ్ల క్రితం దక్షిణాసియా సమాఖ్య (శాఫ్) పోటీలుగా ఆరంభమై, రెండు దశాబ్దాల తరవాత ‘శాగ్’గా రూపాంతరం చెందిన క్రీడోత్సవాలకు సంబంధించి- ఆదినుంచీ పతకాల వేటలో భారత్ ఆధిపత్యం చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. తొమ్మిదేళ్ల క్రితం ఢాకా వేదికపై 90 పసిడిసహా 188 పతకాలు కొల్లగొట్టి, వాయిదాలపై వాయిదాలు పడి మూడేళ్లనాడు గువాహటీ, షిల్లాంగ్‌లలో నిర్వహించిన పోటీల్లో త్రిశతకం సాధించిన ఇండియా దూకుడు ఇప్పుడూ కొనసాగుతోంది. ఏడు దేశాల క్రీడోత్సవంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న భారత్, పోటీల పరిధి విస్తరించేసరికి చతికిలపడుతోంది. నలభైకిపైగా దేశాలు పాల్గొనే ఆసియా క్రీడల్లో, వేర్వేరు ఖండాలకు చెందిన సుమారు డెబ్భై దేశాలు తలపడే కామన్వెల్త్ పోటీల్లో భారత జట్లు అలవాటుగా భంగపడుతున్నాయి.
ఏ మొక్కలేని చోట ఆముదమే మహావృక్షం..
అయిదేళ్ల క్రితం ఇంచియాన్ ఆసియా క్రీడల్లో, నిరుడు జకార్తా పోటీల్లో ఇండియా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. జనాభా ప్రాతిపదికన కామన్వెల్త్ దేశాలన్నింటా అతి పెద్దదైన భారత్ తన స్థాయికి తగిన ప్రదర్శన కొరవడి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, స్కాట్లాండ్‌ల పక్కన చిన్న గీతగా మిగులుతోంది. లండన్ ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా చైనా, ఖతర్, బహ్రెయిన్ వంటివి మెరికల్లాంటి క్రీడాకారుల్ని తీవ్ర శిక్షణలో నిమగ్నం చేయడం కలిసొచ్చి 2017 జులై నాటి ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో రాణించిన మన జట్టు దరిమిలా లండన్‌లో నీరసించిపోవడం తెలిసిందే. ఏ మొక్కా లేని చోట ఆముదమే మహావృక్షమన్న చందంగా ఉంది, దక్షిణాసియాలో మన వాళ్ల రికార్డుల సృష్టి. ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమవుతున్న దేశాలతో ఢీ అంటే ఢీ అంటూ తలపడి నెగ్గుకొచ్చినప్పుడే ఇంతటి సువిశాల భారతావనికి సరైన మన్నన దక్కేది!
ఒలింపిక్స్‌లో వెనుకంజే..
ప్రపంచ పటంలో సూదిమొన మోపేంత జాగాలో దర్శనమిచ్చే సురీనాం, బురుండీలాంటి లఘు దేశాలూ ఒలింపిక్ పతకాలు చేజిక్కించుకుంటుంటే, భారత్ ఏళ్ల తరబడి బిక్కమొగమేస్తోంది. దాదాపు యాభైమంది అథ్లెట్లతో 1996నాటి అట్లాంటా ఒలింపిక్స్‌కు పయనమై వెళ్ళిన బృందంలో ఒకే ఒక్కటి, అదీ కంచుపతకం నెగ్గుకొచ్చినవాడు లియాండర్ పేస్ ఒక్కడే.
రెండు దశాబ్దాల తరవాత 117 మంది సభ్యులతో లండన్ బాట పట్టిన జట్టు గెలుచుకొని తేగలిగింది ఒక కంచు, ఓ వెండి పతకాలే! ఇప్పటివరకు 31 ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇండియా 26 పతకాలే సంపాదించగలిగింది. ఇక్కడితో పోలిస్తే కేవలం నాలుగోవంతు జనాభా కలిగిన అమెరికా ఖాతాలో 2,400కు పైగా ఒలింపిక్ పతకాలు జమపడ్డాయి. తాజాగా ‘వాడా’ (ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ) వేటుపడి రష్యా దూరమై కళతప్పిన టోక్యో ఒలింపిక్స్‌లో 15-20 పతకాలు రాబట్టగలమని ఐఓఏ (భారత ఒలింపిక్ సంఘం), ఎస్‌ఏఐ (క్రీడా ప్రాధికార సంస్థ) ధీమాగా చెబుతున్నాయి.
2024నాటి పారిస్ ఒలింపిక్స్‌లో రెండంకెల సంఖ్యలో పతకాలు లక్షిస్తున్నామని, 2028నాటి లాస్ ఏంజెలిస్ సమరంలో పది అగ్ర జట్లలో ఒకటిగా నిలుస్తామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాతికి అభయమిస్తోంది. కాగితాలపై పథకరచన వేరు, సత్ఫలితాలు ఇవ్వగల పటిష్ఠ కార్యాచరణ వేరు! సహజసిద్ధ ప్రతిభా పాటవాలకు కొదవలేని దేశం మనది. పుష్కల మానవ వనరులు కలిగిన గడ్డమీద ముడి వజ్రాలను గుర్తించి వెలికితీసే పకడ్బందీ వ్యవస్థ, మేలిమి శిక్షణ సమకూర్చి రాటుతేల్చి అవకాశాలతోపాటు ప్రోత్సాహకాలు అందించే సమర్థ యంత్రాంగం కొరవడినందువల్లే ఇంతటి పతకాల దాహార్తి దాపురించింది.
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ, మండలాలవారీగా ఉమ్మడి మైదానాల ఏర్పాటు ఎండమావుల్ని తలపిస్తున్నాయి. బడి దశలోనే క్రీడాసక్తి కలిగినవారికి ప్రత్యేక శిక్షణ, వారి భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా ఉండబోదని తల్లిదండ్రులకు భరోసా సాకారమైనప్పుడే- ప్రత్యర్థులు ఎవరన్నదానితో నిమిత్తం లేకుండా ఏ క్రీడా వేదికపైన అయినా భారత్ జయపతాక ఎగరేయగలుగుతుంది!