Bindyarani Devi Weightlifting : భారత వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి దేవి అదరగొట్టింది. శనివారం జరిగిన ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాన్ ఒలంపిక్ కేటగిరీ 55 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. తొలి ప్రయత్నంలోనే స్నాచ్ 80 కేలోల బరువు లిఫ్ట్ చేసిన బింద్యా.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో స్నాచ్ 83 కేలోల బరువును సౌకర్యంగా ఎత్తింది. కానీ మూడో ప్రయత్నంలో ఆమె 85 కేజీల బరువు ఎత్తలేకపోయింది.
మూడో ప్రయత్నంలో స్నాచ్ ఎత్తలేకపోయిన బింద్యా.. క్లీన్ అండ్ జెర్క్‌లో రెండవ అత్యధిక బరువు ఎత్తి సిల్వర్‌ను సొంతం చేసుకుంది. కాగా, బింద్యా గతేడాది పారిస్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. 59 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో 25వ స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో 194 కిలోల (83కిలో+111కిలో) బరువు ఎత్తి సిల్వర్ మెడల్ సాధించింది.
మీరీబాయికి నిరాశ :
mirabai chanu weightlifting :ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత టాప్ లిఫ్టర్ మీరాబాయి చాను నిరాశపరిచింది. 49 కేజీల విభాగంలో స్నాచ్‌లో 85, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 స్కోరు చేసి మొత్తం 194 కేజీల బరువుతో ఆరో స్థానంలో నిలిచింది. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే 85 కిలోల బరువును ప్రదర్శించింది. తర్వాత 88 కేజీల బరువు ఎత్తేందుకు రెండు సార్లు విఫలయత్నాలు చేసింది. క్లీన్ అండ్ జెర్క్‌లో తొలిసారిగా 109 కేజీలు ఎత్తిన ఆమె.. ఆ తర్వాత రెండు ప్రయత్నాలను విరమించుకుంది.
ఈ ఏడాది జరగబోయే ఆసియా క్రీడలపైనే ఆమె దృష్టి సారించిన చాను.. ఈ ఆసియా ఛాంపియన్‌షిప్‌ను ఆమె లైట్ తీసుకున్నట్లు సమాచారం. చైనా లిఫ్టర్లు జియాంగ్ (207 కేజీ), జిహుయ్ (204 కేజీ) వరుసగా బంగారు, రజత పతకాలు సాధించారు. థాయ్‌లాండ్ అమ్మాయి సెరోద్చన (200 కేజీ) కాంస్యం సాధించింది. 2021 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మీరా కాంస్యం సాధించింది.
భారత్ గర్వంగా ఉంది : అనురాగ్ ఠాకూర్
బింద్యారాణి ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ గెలవడంపై యూనియన్ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రజత పతకం గెలిచినందుకు ఆమెకు అభినందనలు తెలియజేశారు. "ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 55 కిలోల విభాగంలో రజత పతకం సాధించినందుకు #TOPScheme అథ్లెట్ బింద్యారాణి దేవికి అభినందనలు. మీరు సాధించిన విజయంతో భారత్ గర్వంగా ఉంది. ఆల్ ది బెస్ట్, ఇలాగే కొనసాగండి!" అని ట్విట్టర్ పోస్టు పెట్టారు.