ఒలింపిక్స్ సన్నాహాకానికి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ కీలకమని స్టార్ బాక్సర్ మేరీ కోమ్ చెప్పింది. దుబాయ్‌లో 24న ఆరంభమయ్యే టోర్నీలో తలపడాలని ఆమె ఆశిస్తోంది. ఈ టోర్నీ తనకు చాలా అవసరమని పేర్కొంది.
"రింగ్‌లోకి దిగాలని తహతహలాడుతున్నా. మహమ్మారి కారణంగా ఇంతకాలం పెద్దగా ప్రాక్టీసే లేదు. ఒలింపిక్స్‌కు ముందు నన్ను నేను అంచనా వేసుకోవడానికి ఆసియా చాంపియన్‌షిప్ చాలా అవసరం" అని ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ (51 కేజీల విభాగం) వెల్లడించింది.
మేరీ కోమ్ ప్రస్తుతం పుణేలో ఉంది. కరోనా కారణంగా దిల్లీలో జాతీయ శిబిరాన్ని మూసివేయడం వల్ల ఇంకొందరు బాక్సర్లతో పాటు ఆమె పుణేకు మారింది. ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో సాధన చేసింది. "చాలా కారణాలతో నా ట్రెయినింగ్ షెడ్యూలు దెబ్బతింది. కాబట్టి ఆసియా చాంపియన్‌షిప్ చాలా ముఖ్యమైంది. అక్కడ పోటీ పడే అవకాశం వస్తుంది. ఒలింపిక్ సన్నాహాలకు మంచి టోర్నీకి మించి ఉపయోగపడేదేముంటుంది" అని మేరీకోమ్ చెప్పింది.