ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ముందు బాక్సర్లు ఆడనున్న చివరి టోర్నీ ఏషియన్ ఛాంపియన్షిప్స్. దుబాయ్ వేదికగా సోమవారం నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 27 దేశాలు ఇందులో పాల్గొంటాయని భావించినప్పటికీ.. కొవిడ్‌తో పాటు అంతర్జాతీయ ప్రయాణ నిబంధనల కారణంగా ఆ సంఖ్య 17కే పరిమితమైంది.
భారత్ తరఫున మొత్తం 19 మంది బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో పది మంది మహిళా బాక్సర్లు కాగా.. మిగిలిన వారు పురుషులు. మొత్తంగా 10 కేటగిరీల్లో 47 మంది మహిళా బాక్సర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మహిళా బాక్సర్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సారి ఏడు పతకాలు కైవసం చేసుకుంటామని భారత బాక్సర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
థాయిలాండ్ వేదికగా 2019లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన భారత్.. ఈసారి కూడా అద్భుతంగా రాణించాలని కోరుకుంటోంది. గతంలో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్య పతకాలతో మొత్తం 13 మెడల్స్‌ను ఖాతాలో వేసుకున్నారు మన బాక్సర్లు. కరోనా కారణంగా ఇప్పటికే పలు పోటీలు రద్దు అయ్యాయి. దీంతో ఒలింపిక్స్‌కు ముందు ఈ టోర్నీ కీలకంగా మారింది.
ఇదీ చదవండి: ర్యాన్ 'చిరిగిన బూట్ల'కు స్పాన్సర్ దొరికేశారు
డిఫెండింగ్ ఛాంపియన్ అమిత్ పంగాల్(52 కేజీ) సహా ఆరుగురు బాక్సర్లు ఇప్పటికే తొలి రౌండ్లో బై సాధించారు. వీరితో పాటు గత సీజన్ పతక విజేత ఆశీష్ కుమార్(75 కేజీ), వికాస్ క్రిష్ణన్(69 కేజీ).. కూడా ఈ సారి టోర్నీల్లో ఫేవరేట్లుగా బరిలోకి దిగుతున్నారు. గత నాలుగు సీజన్లలో వరుసగా నాలుగు పతకాలు సాధించిన శివ తాపా(64 కేజీ) కూడా పతక ఆశావాహుల్లో ఒకడు. సౌత్ ఏషియన్ గేమ్స్ బంగారు పతక విజేత వినోద్ తన్వార్(49 కేజీ).. కొవిడ్ కారణంగా ఈ పోటీలకు దూరమయ్యాడు.
ఇక మహిళల విభాగంలో ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్.. ఈ పోటీల్లో గతంలో ఐదు సార్లు బంగారు పతకాలు గెలుపొందింది. ఆమెతో పాటు సిమ్రన్ జీత్ కౌర్(60 కేజీ), లోవ్లీనా బోర్గోహైన్(69 కేజీ), డిఫెండింగ్ ఛాంపియన్ పూజా రాణి(75 కేజీ).. ఈ పోటీల్లో పతకాన్ని ఆశించే వారిలో ఉన్నారు. ఈ నలుగురూ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
ఈ సారి ప్రైజ్ ఫండ్ మొత్తాన్ని రూ.2.91 కోట్లకు పెంచారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. కాగా, భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సిన ఈ పోటీలను కొవిడ్ కారణంగా దుబాయ్‌కు తరలించారు. ఇందులో పసిడి పతకం సాధించిన వారికి రూ.7.29 లక్షలు, రజత పతక విజేతలకు రూ.3.64 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.1.82 లక్షలు ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నారు.
భారత స్క్వాడ్స్..
పురుషులు:
అమిత్ పంగాల్(52 కేజీ), మహమ్మద్ హుసాముద్దీన్(56 కేజీ), వరిందర్ సింగ్(60 కేజీ), శివ తాపా(64 కేజీ), వికాస్ క్రిష్ణన్(69 కేజీ), ఆశీష్ కుమార్(75 కేజీ), సుమిత్ సంగ్వాన్(81 కేజీ), సంజీత్(91 కేజీ), నరేందర్(91+ కేజీ).
మహిళలు:
మోనికా(48 కేజీ), మేరీ కోమ్(51 కేజీ), సాక్షి(54 కేజీ), జాస్మిన్(57 కేజీ), సిమ్రన్‌జీత్ కౌర్(60 కేజీ), లాల్బూటా సాయిహి (64 కేజీ), లోవ్లీనా బోర్గోహైన్(69 కేజీ), పూజా రాణి(75 కేజీ), సావితీ(81 కేజీ), అనుపమ(81+ కేజీ).
ఇదీ చదవండి: త్వరలోనే వారికి ప్రపంచకప్ ప్రైజ్‌మనీ