"క్రికెట్లో బ్యాట్స్‌మెన్ పరుగులు చేసినట్లు.. హాకీలో గోల్స్ చేశాడు" అంటూ దిగ్గజ క్రికెటర్ సర్ డాన్ బ్రాడ్‌మన్ కితాబు అందుకున్న భారత లెజెండరీ హాకీ ఆటగాడు ధ్యాన్‌చంద్. మైదానంలో అడుగుపెట్టాడంటే అతడిని కట్టడిచేసేందుకు ప్రత్యర్థులు మల్లగుల్లాలు పడేవాళ్లు. 1928,32,36 ఒలింపిక్స్‌లలో భారత జట్టుకు స్వర్ణాలు సాధించిపెట్టాడు. ఆయన ఆటను చూస్తూ స్టేడియంలో ప్రేక్షకులు కేరింతలు కొట్టేవాళ్లు. ధ్యాన్‌చంద్‌కు నివాళిగా ఏటా ఆయన పుట్టినరోజైన ఆగస్టు 29న జాతీయ క్రీడాదినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా హాకీ దిగ్గజం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు.
ధ్యాన్‌చంద్‌కు ఆ పేరు ఎలా వచ్చిదంటే..
1905లో జన్మించిన ధ్యాన్‌చంద్ అసలు పేరు ధ్యాన్‌సింగ్. 16వ ఏటనే సైన్యంలో చేరిన అతడు హాకీపై మక్కువతో రాత్రి వేళల్లో ప్రాక్టీస్ చేసేవాడంట. అప్పుడు ఆయన సహచరులు 'చాంద్' అని పిలవడం మొదలు పెట్టారంట. చాంద్ అంటే హిందీలో చంద్రుడు అని అర్థం. క్రమేణా ఆ పేరు కాస్త ధ్యాన్‌చంద్‌గా మారింది. ఈ విధంగా రాత్రిపూట ఉదయించే చంద్రుడిలా ధ్యాన్‌సింగ్ పేరు కాస్త ధ్యాన్‌చంద్‌గా రూపాంతరం చెందింది.
హాకీ కర్ర పట్టుకున్న మాంత్రికుడు..
1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్‌లో ధ్యాన్‌చంద్ 14 గోల్స్ చేసి.. భారత జట్టు అప్రతిహత జైత్రయాత్రను కొనసాగించాడు. ఆయన ఆటకు ముగ్ధులైన ఓ అంతర్జాతీయ వార్తాప్రత్రిక "ఇది హాకీ కాదు.. మ్యాజిక్.. ధ్యాన్‌చంద్ హకీ కర్ర పట్టుకున్న మాంత్రికుడు" అంటూ కథనంలో ప్రచురించింది.
హాకీ ట్విన్స్
1932 ఒలింపిక్స్‌లో అమెరికాపై 24-1, జపాన్‌పై 11-1 తేడాతో ఘన విజయాల్ని సొంతం చేసుకుంది భారత హాకీ జట్టు. ఈ రెండు మ్యాచ్‌ల్లో నమోదైన 35 గోల్స్‌లో ధ్యాన్‌చంద్ 12, ఆయన సోదరుడు రూప్ సింగ్ 13 గోల్స్ చేసి హాకీ కవల సోదరులుగా(హాకీ ట్విన్స్)గా పేరు గడించారు.
గోల్ పోస్ట్ తప్పుడు ప్రమాణం..
ఓ మ్యాచ్‌లో ధ్యాన్‌చంద్ ఒక్క గోల్ కూడా చేయలేదు. గోల్ పోస్ట్ కొలత తప్పుగా ఉందంటూ మ్యాచ్ రిఫరీతో వాదనకు దిగాడు. అందరూ ధ్యాన్‌చంద్‌ను తప్పుపట్టారు. ఇందులో ఆశ్చర్యమేమంటే నిజంగానే గోల్‌పోస్ట్ అంతర్జాతీయ ప్రమాణాల కంటే తక్కువ వెడల్పుతో ఉంది.
బెర్లిన్‌లో మ్యాజిక్ షో..
1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో విచిత్రం చోటు చేసుకుంది. 'ఒలింపిక్స్ స్టేడియంలో మ్యాజిక్ షో జరగబోతుంది. భారత హాకీ మాంత్రికుడు తన మాయాజాలంతో ఆకట్టుకోబోతున్నాడు' అంటూ బెర్లిన్ నగరంలోని గోడలన్నింటిపై పోస్టర్లు అతికించారు.
హిట్లర్ ఆఫర్ తిరస్కరణ..
ధ్యాన్‌చంద్ ఆటకు ప్రభావితుడైన జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్.. జర్మన్ పౌరసత్వంతో పాటు.. సైన్యంలో కీలక పదవినిస్తానని ఆయన ముందు ప్రతిపాదన తెచ్చాడు. హిట్లర్ ఆఫర్‌ను తిరస్కరించిన హాకీ దిగ్గజం తాను మరణించేంతవరకు భారతీయుడిగానే ఉంటానని తెలిపాడు.
ముగ్ధుడైన బ్రాడ్‌మన్..
1935లో ఆస్ట్రేలియాలో పర్యటించింది టీమిండియా హాకీ జట్టు. మొత్తం 43 మ్యాచ్‌ల్లో భారత్ 584 గోల్స్ చేసింది. అందులో ధ్యాన్‌చంద్ ఒక్కడే 201 గోల్స్ నమోదు చేశాడు. "క్రికెట్లో బ్యాట్స్‌మన్ పరుగులు చేసినట్లు హాకీలో గోల్స్ చేశాడు" అంటూ ధ్యాన్‌చంద్‌ను ప్రశంసించాడు ఆ టోర్నీకి హాజరైన క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్.
హాకీ కర్ర విరగ్గొట్టారు..
ధ్యాన్‌చంద్ ఆటను చూసి ఆశ్చర్యపోయిన నెదర్లాండ్స్ హాకీ అధికారులు ఆయన హాకీ కర్రలో అయస్కాంతం ఉందేమోనని విరగ్గొట్టి మరీ పరీక్షించారు. 1922 నుంచి 1948 వరకు భారత హాకీ క్రీడాకారుడిగా సేవలందించాడు ధ్యాన్‌చంద్. 22 ఏళ్ల కెరీర్లో మొత్తం 400 గోల్స్ చేశాడు.
ధ్యాన్‌చంద్‌కు నివాళిగా ఆయన పుట్టినరోజున 2012 నుంచి జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వివిధ ఆటల్లో విశేషంగా రాణించిన క్రీడాకారులు, శిక్షకులకు ఈ రోజునే క్రీడాపురస్కారాలు ప్రదానం చేస్తారు.
ఇది చదవండి: దక్షిణాఫ్రికా సిరీస్‌కు ధోనీ స్థానంలో పంత్..!